ఢిల్లీని బోణీ కొట్టించిన రబడ | IPL 2020: Delhi Win Against Kings Punjab Match | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ సూపర్‌ ఫ్లాప్‌...

Published Mon, Sep 21 2020 5:43 AM | Last Updated on Mon, Sep 21 2020 9:26 AM

IPL 2020: Delhi Win Against Kings Punjab Match - Sakshi

3 ఓవర్లు... మూడంటే మూడే ఓవర్లు ఇరు జట్లను హోరెత్తించాయి. చప్పగా సాగే ఆటను మెరుపుల మయం చేశాయి. మొదట స్టొయినిస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్పీడ్‌ గేర్‌లోకి మార్చేశాడు. 17 ఓవర్లలో 100/6గా ఉన్న స్కోరు ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 157/8కు చేరింది. తర్వాత మయాంక్‌ పంజాబ్‌ను విజయ తీరానికి తెచ్చాడు. 116/6తో లక్ష్యానికి దూరమైన పంజాబ్‌ను సిక్స్‌లు, ఫోర్లతో మయాంక్‌ చేతుల్లోకి తెచ్చాడు. 19.3 ఓవర్లలో 157/6తో సమం చేశాడు. కానీ మ్యాచ్‌ను ఆఖరి మూడు బంతులు అనూహ్యంగా ‘టై’గా చేశాయి. చివరకు ‘సూపర్‌ ఓవర్‌’కుదారి తీసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్‌ బోణీ కొట్టింది. 

దుబాయ్‌: ఐపీఎల్‌–2020 సీజన్‌లో రెండో మ్యాచ్‌కే ‘సూపర్‌’ కార్డు పడింది. కానీ ఈ సూపర్‌ ఓవర్లో పంజాబ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. పూర్తిగా 6 బంతులు ఆడలేదు. 2 పరుగులకు మించి చేయనేలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్‌ బోణీ కొట్టింది. సాధారణంగా మెరుపులు మాత్రమే కనిపించే సూపర్‌ ఓవర్లో ఢిల్లీ బౌలర్‌ రబడ ఆ మెరుపులకు మసకేశాడు. బౌలింగ్‌ సత్తాతో కింగ్స్‌ను ఓడించాడు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టొయినిస్‌ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. కింగ్స్‌ బౌలర్లలో షమీ 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది. మయాంక్‌ అగర్వాల్‌ (60 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. కానీ తమ జట్టును ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వలేకపోయాడు. 

క్యాపిటల్స్‌ కట్టడి... 
ఆట మొదలైంది... క్యాపిటల్స్‌ కట్టడి అయింది. ధావన్‌ డకౌట్, పృథ్వీ షా 5 పరుగులకే నిష్క్రమణ. ‘హిట్టర్‌’ హెట్‌మైర్‌ చేసింది ఏడే పరుగులు. జట్టు స్కోరు 4 ఓవర్లలో 13/3. షమీ నిప్పులు చెరిగాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లేకు ఇంకా 2 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఈ నాలుగు ఓవర్లలో బంతి రెండే సార్లు బౌండరీకెళితే... ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 39; 3 సిక్స్‌లు)కు పిచ్‌ పరిస్థితి అర్థమైంది. జతకలిసిన రిషభ్‌ పంత్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు)కు బౌలర్ల బలం తెలిసొచ్చింది. ఇక ఇద్దరికీ వికెట్ల విలువేంటో బుర్రకెక్కింది. అందుకే తేరుకునేదాకా ఓపిక పట్టారు. భారీ షాట్లను కాసేపు పక్కనబెట్టారు. ఈ దశలో 9వ ఓవర్‌ మెరుపులకు తట్టిలేపింది. గౌతమ్‌ తొలి బంతిని పంత్‌ లాంగ్‌ లెగ్‌లోకి ఫోర్‌ కొడితే... నాలుగో బంతిని అయ్యర్‌ లాంగాన్‌లో సిక్సర్‌గా తరలించాడు. కానీ తర్వాత ఈ జోరేమీ కొనసాగలేదు. మళ్లీ 13వ ఓవర్‌ గౌతమ్‌ వేశాడు. వరుస బంతుల్ని అయ్యర్‌ సిక్సర్లుగా బాదేశాడు. ఇక వేగం పుంజుకుంటుందిలే అనుకుంటే వరుస ఓవర్లలో పంత్, అయ్యర్‌ ఔటయ్యారు. నాలుగో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 87/5 స్కోరుతో ఢిల్లీ కథ మళ్లీ మొదటికొచ్చింది.   

స్టొయినిస్‌ మెరుపులు... 
అక్షర్‌ పటేల్‌ వచ్చినా 6 పరుగులకు మించనే లేదు. దీంతో వందలోపే ఢిల్లీ 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్టొయినిస్‌ దారితప్పిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను స్పీడ్‌ట్రాక్‌లో పడేశాడు. ధనాధన్‌ దంచేసి చకచకా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 17 ఓవర్లలో 100/6గా ఉన్న స్కోరులో మిగిలిన ఆ మూడు ఓవర్లలోనే మరో 57 పరుగులు వచ్చి చేరాయి. జోర్డాన్‌ 18వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన స్టొయినిస్‌... కాట్రెల్‌ 19వ ఓవర్లో 3 బౌండరీలు కొట్టాడు. మళ్లీ జోర్డాన్‌ ఆఖరి ఓవర్‌ వేస్తే 6, వైడ్, 4, 4, 4, 6తో చెలరేగాడు. 20 బంతుల్లోనే (7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపువేగంతో అర్ధసెంచరీ సాధించాడు. చివరకు నోబాల్‌కు రనౌటయ్యాడు.  

అశ్విన్‌ పంజా... 
ఢిల్లీకి విరుద్ధంగా పంజాబ్‌ ఆట సాగింది. క్యాపిటల్స్‌ నాలుగు ఓవర్లకే నానా కష్టాలు పడితే... కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు సాధికారికంగా సాగింది. వికెట్‌ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత ఓవర్లు పంజాబ్‌పై పడగ విప్పాయి. మోహిత్‌ శర్మ ఐదో ఓవర్లో రాహల్‌ (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌ వేసిన అశ్విన్‌... తొలి బంతికి కరుణ్‌ నాయర్‌ (1)ను, ఐదో బంతికి హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ (0)ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత అశ్విన్‌ గాయపడటంతో బౌలింగ్‌ చేయలేదు. అశ్విన్‌ భుజం గాయంతో నిష్క్రమించాక... రబడ కూడా పంజాబ్‌ను ఓ దెబ్బ వేశాడు. డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ (1)కు పెవిలియన్‌ దారి చూపాడు. అంతే 30/0 స్కోరు నుంచి 35/4గా పంజాబ్‌ స్కోరు తిరగబడింది. రబడ ధాటికి సర్ఫరాజ్‌ (12) నిలువలేదు. 

మయాంక్‌ కిర్రాక్‌...
పంజాబ్‌ స్కోరు 35/4తో ఉన్న దశలో ఓపెనర్‌ మయాంక్‌ ఒంటరి పోరాటం చేశాడు. గౌతమ్‌ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌)తో కలిసి జట్టు స్కోరును వందకు చేర్చాడు. కుదురుగా ఆడుతూ 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అగర్వాల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరోవైపు గౌతమ్‌ వికెట్‌ను తీసిన రబడ ఈ జోడీని ప్రమాదకరం కాకుండా చేశాడు. కింగ్స్‌ స్కోరు 17 ఓవర్లలో 116/6. గెలిచేందుకు ఆఖరి 18 బంతుల్లో 42 పరుగులు చేయాలి. ఈ దశలో మయాంక్‌ శివమెత్తాడు. మోహిత్‌ వేసిన 18వ ఓవర్లో 2 సిక్సర్లు, రబడ 19వ ఓవర్లో 2 బౌండరీలు బాదడంతో పంజాబ్‌ లక్ష్యానికి చేరువైంది. మిగిలినవి 6 బంతులు... చేయాల్సినవి 13 పరుగులు... స్టొయినిక్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లో మయాంక్‌ 6, 2, 4లతో గెలుపువాకిట నిలిపాడు. డాట్‌ బాల్‌ తర్వాత ఐదో బంతికి మయాంక్‌... ఆరో బంతికి జోర్డాన్‌ (5) ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement