షార్జా: ‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు. దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తేవటియా హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి 20 బంతులు తన కెరీర్‌లో అత్యంత చెత్త బంతులు అని క్రీజులో నిలదొక్కుకునేందుకు శ్రమించిన తీరును ప్రస్తావించాడు. (చదవండి: పరుగుల హోరులో రాజస్తాన్ దరహాసం)
కాగా ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తేవటియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు విక్టరీలో కీలక పాత్ర పోషించారు. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసిన తేవటియా గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్, 18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి కాట్రెల్‌కు చుక్కలు చూపాడు. అయితే సెకండ్ డౌన్‌లో తేవటియాను రంగంలోకి దింపడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.
అందుకు తగ్గట్టుగానే ఆరంభంలో అతడు తడబడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో తెవాతియా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేదు. అయితే శాంసన్ ఔటైన తర్వాత దూకుడు పెంచిన 27 ఏళ్ల తెవాతియా తన విశ్వరూపం ప్రదర్శించాడు. 12 బంతుల్లో 45 పరుగులు చేసి కింగ్స్ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఏడు సిక్సర్లు బాది సత్తా చాటాడు.
ఈ విషయం గురించి తేవటియా మాట్లాడుతూ.. ‘‘తొలి 20 బంతుల వంటి చెత్త బంతులు ఎప్పుడూ ఎదుర్కోలేదు. నెట్స్‌లో చాలా బలంగా బంతిని బాదేవాడిని. అదే నమ్మకంతో బరిలోకి దిగాను. కానీ తొలి హిట్టింగ్ ఆడలేకపోయా. కానీ డగౌట్‌లో అందరూ నావైపే చూడటం గమనించాను. ఎందుకంటే నేను సిక్సర్లు కొట్టగలనని వాళ్లకు తెలుసు. ఆ తర్వాత అదే నిజమైంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌ఆర్, మూడు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్ల తేడాతో అపూర్వ విజయం సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment