ఇరగదీసిన ఓపెనర్లు.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం | IPL 2021 2nd Phase: RCB Vs KKR Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2021 2nd Phase RCB Vs KKR: ఇరగదీసిన ఓపెనర్లు.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం

Published Mon, Sep 20 2021 7:12 PM | Last Updated on Mon, Sep 20 2021 10:49 PM

IPL 2021 2nd Phase: RCB Vs KKR Match Live Updates And Highlights - Sakshi

Photo Courtesy: IPL

ఇరగదీసిన ఓపెనర్లు.. 9 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం    
అబుదాబీ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ  మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 19 ఓవర్లలో 92 పరగులకే చతికిలబడింది. కేకేఆర్‌ బౌలర్లు వరణ్‌ చక్రవర్తి(3/13), ఆండ్రీ రసెల్(3/9), ఫెర్గూసన్‌(2/24), ప్రసిధ్‌(1/24) ఆర్సీబీ పతనాన్ని శాసించారు. అనంతరం​ 93 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌(34 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌(27 బంతుల్లో 41 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) ఇరగదీయడంతో కేకేఆర్‌ కేవలం 10 ఓవర్లలోనే గిల్‌ వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం కుర్రాడు వెంకటేశ్‌ అయ్యర్‌ లక్ష్యానికి 11 పరుగులు అవసరముండగా మూడు బౌండరీలు బాది మ్యాచ్‌ను పూర్తి చేశాడు. ఆర్సీబీ బౌలర్‌ చహల్‌కు ఏకైక వికెట్‌ లభించింది. మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు ఓ క్యాచ్‌ మరో రనౌట్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తికి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. గిల్‌(48) ఔట్‌
ధాటిగా ఆడుతున్న కేకేఆర్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(34 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్‌) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి 2 పరుగుల తేడాతో అర్ధ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కేకేఆర్‌.. లక్ష్యానికి మరో 11 పరుగుల దూరంలో ఉండగా చహల్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ ఔటయ్యాడు. 9.1 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 82/1. క్రీజ్లో వెంకటేశ్‌ అయ్యర్‌(22 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్‌), రసెల్‌ ఉన్నారు. కేకేఆర్‌ గెలుపుకు మరో 11 పరుగులు అవసరం కాగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి

ధాటిగా ఆడుతున్న కేకేఆర్‌ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 56/0
93 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌(21 బంతుల్లో 30; 5 ఫోర్లు), వెంకటేశ్‌ అయ్యర్‌(16 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్‌) ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరి ధాటికి కేకేఆర్‌ 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.


Photo Courtesy: IPL

ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. 92 పరుగులకే ఆలౌట్‌
రసెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఆఖరి బంతికి సిరాజ్‌(10 బంతుల్లో 8; ఫోర్‌) ఔట్‌ కావడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు 92 పరగుల వద్ద తెరపడింది. రసెల్‌ బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి క్యాచ్‌ అందుకోవడంతో సిరాజ్‌ వెనుదిరిగాడు. దీంతో మరో ఓవర్‌ ఉండగానే ఆర్సీబీ ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 13 పరుగుల మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టగా, రసెల్‌(3/9) సైతం పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆర్సీబీ వెన్నువిరిచాడు. ఆర్సీబీ పతనంలో ఫెర్గూసన్‌(2/24), ప్రసిధ్‌(1/24) తమ వంతు పాత్ర పోషించారు. వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు ఓ క్యాచ్‌ మరో రనౌట్‌ చేశాడు.

83 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. హర్షల్‌ పటేల్‌(12) ఔట్‌
కేకేఆర్‌ బౌలర్ల ధాటికి ఆర్సీబీ 83 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది.  ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ మూడో బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌(10 బంతుల్లో 12; 2 ఫోర్లు) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 16.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 83/9. క్రీజ్‌లో సిరాజ్‌(2), చహల్‌ ఉన్నారు. 

8వ వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. జేమీసన్‌(4) రనౌట్‌
కనీసం ముడంకెల స్కోర్‌ కూడా రీచ్‌ కాకుండానే ఆర్సీబీ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. 15.3 బంతికి వరుణ్‌ చక్రవర్తి అద్భుతమైన త్రో కారణంగా జేమీసన్‌(12 బంతుల్లో 4) రనౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ 76 పరుగుల వద్ద 8వ వికెట్‌ కోల్పోయింది. క్రీజ్లో హర్షల్‌ పటేల్‌(7), సిరాజ్‌ ఉన్నారు.

పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. సచిన్‌ బేబి(7) ఔట్‌
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో  పడింది. కేవలం 66 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఆర్సీబీని మరోసారి దెబ్బతీశాడు. 14వ ఓవర్‌ నాలుగో బంతికి సచిన్‌ బేబి(17 బంతుల్లో 7) పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్‌లో జేమిసన్‌(2), హర్షల్‌ పటేల్‌ ఉన్నారు. వరణ్‌ చక్రవర్తి 3 వికెట్లు సాధించగా, రసెల్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 


Photo Courtesy: IPL

వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టిన వరణ్‌ చక్రవర్తి
12వ ఓవరల్లో వరణ్‌ చక్రవర్తి వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. 12వ ఓవర్‌ నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన వరుణ్‌.. ఆ మరుసటి బంతికే హసరంగను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 11.5 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 63/6. ప్రస్తుతం క్రీజ్‌లో సచిన్‌ బేబి(6), జేమీసన్ ఉన్నారు.


Photo Courtesy: IPL

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్‌ (10) ఔట్‌
కేకేఆర్‌ బౌలర్ల ధాటికి  ఆర్సీబీ బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. మ్యాక్స్‌వెల్‌(10)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వరణ్‌ చక్రవర్తి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు. 11.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 63/5. ప్రస్తుతం క్రీజ్‌లో సచిన్‌ బేబి(6), హసరంగ ఉన్నారు.

ఆర్సీబీకి మరో షాక్‌.. డివిలియర్స్‌ గోల్డెన్‌ డక్‌
కేకేఆర్‌ బౌలర్‌ రసెల్‌ ఆర్సీబీకి భారీ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆర్సీబీని గట్టి దెబ్బ కొట్టాడు. 9వ ఓవర్‌ తొలి బంతికి  శ్రీకర్‌ భరత్‌ను ఔట్‌ చేసిన రసెల్‌ డేంజరస్‌ ఆటగాడు డివిలియర్స్‌ను  గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు సాగనంపాడు. డివిలియర్స్‌ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 8.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 52/4. క్రీజ్లో మ్యాక్స్‌వెల్‌(6), సచిన్‌ బేబి ఉన్నారు.

ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌.. శ్రీకర్‌ భరత్‌(16) ఔట్‌ 
అరంగేట్రం కుర్రాడు శ్రీకర్‌ భరత్‌(19 బంతుల్లో 16; ఫోర్‌) ఏమాత్రం ప్రభావం చూపకుండానే వెనుదిరిగాడు. రసెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ తొలి బంతికి శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 8.1 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 51/3. క్రీజ్లో మ్యాక్స్‌వెల్‌(5), డివిలియర్స్‌ ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. పడిక్కల్‌(22) ఔట్‌ 
టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం, ఆర్సీబీ ఓపెనర్‌  దేవ్‌దత్‌ పడిక్కల్‌ 22 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌ 3 బౌండరీలు బాదాడు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 41/2. క్రీజ్లో శ్రీకర్‌ భరత్‌(11), మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్‌.. కెప్టెన్‌ కోహ్లి(5) ఔట్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(4 బంతుల్లో 5; ఫోర్‌) రెండో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనపించిన కోహ్లి.. అతరువాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 1.4 ఓవర్ల తర్వాత ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజ్లో పడిక్కల్‌(4), శ్రీకర్‌ భరత్‌ ఉన్నారు.

అబుదాబీ: ఐపీఎల్-2021 సెకెండ్‌ ఫేస్‌లో భాగంగా నేడు(సోమవారం) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ.. సీజన్‌ తొలి అంచెలో పాల్గొన్న జట్టులో మూడు మార్పులు చేసింది. గాయపడిన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగా బరిలోకి దిగుతుండగా.. కొత్త కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం చేయనున్నాడు.

గత మ్యాచ్‌లో ఆడిన షాబాజ్ అహ్మద్‌ను కూడా ఆర్సీబీ పక్కకు పెట్టింది. అతని స్థానంలో సచిన్‌ బేబి వచ్చాడు. మరోవైపు కేకేఆర్‌ సైతం మూడు మార్పులు చేసింది. లీగ్‌కు అందుబాటులో లేని పాట్‌ కమిన్స్‌ స్థానంలో లూకీ ఫెర్గూసన్‌ను, షకీబ్‌ అల్‌ హసన్‌ స్థానంలో సునీల్‌ నరైన్‌, హర్భజన్‌ స్థానంలో కొత్త కుర్రాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను బరిలోకి దించింది. 

ఇక, ఇరు జట్ల మధ్య తొలి అంచెలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేననే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో మ్యాక్సీ(78), డివిలియర్స్(76 నాటౌట్) అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఆర్సీబీ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 204 పరుగుల భారీ స్కోర్ చేయగా... కేకేఆర్ 166/8 పరుగులకే పరిమితమైంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 7 మ్యాచ్‌లు ఆడగా, ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో, కేకేఆర్‌ కేవలం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. 

తుది జట్లు:
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్‌), దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ

ఆర్సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్‌ భరత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, సచిన్‌ బేబి, కైల్ జేమీసన్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement