సాక్షి క్రీడావిభాగం:
మన పొట్టి లీగ్... మరో 11 రోజుల్లో మెరుపులు మెరిపించేందుకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే 14వ సీజన్ ఐపీఎల్ టోర్నీకి కొన్ని విశేషాలున్నాయి. కోవిడ్‌తో గతేడాది మన ఆతిథ్యానికి దూరమైంది. ఇప్పుడు మళ్లీ మన దేశానికి వచ్చేసింది. అలాగే తక్కువ వ్యవధిలో అంటే అర్ధసంవత్సరానికే ఈ సీజన్ జరగనుంది. లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు ‘బయో బబుల్’లో నిర్వహించారు. ఇప్పుడు భారత్ ‘బబుల్’లో జరిగే తొలి ఐపీఎల్ కూడా ఇదే! ఇన్నాళ్లు జరిగినట్లుగా ఇంటా బయటా కాకుండా మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లోనే జరుగుతాయి. ఫలితంగా ఏ జట్టుకూ తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండాపోయింది.
సాఫ్ట్ సిగ్నల్ బెంగలేదు...
ఇటీవల భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టి20 సిరీస్ సందర్భంగా చర్చనీయాంశమైన ‘సాఫ్ట్ సిగ్నల్’ను ఈ ఐపీఎల్‌లో పక్కనబెట్టేశారు. అంటే ఫీల్డ్ అంపైర్లు సందేహాస్పద నిర్ణయాలను థర్డ్ అంపైర్ (టీవీ అంపైర్)కు నివేదించినప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు ఈ ‘సాఫ్ట్ సిగ్నల్’ అడ్డుకాబోదు. తనకు నివేదించిన అప్పీలుపై థర్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం అవుతుంది.
షార్ట్ రన్ లెక్క ఇక పక్కా..
గత ఐపీఎల్‌లో పరుగు కొరత పంజాబ్ కింగ్స్‌ను నిండా ముంచేసింది. ఫీల్డ్ అంపైర్ల తప్పిదం షార్ట్‌రన్‌కు దారితీస్తుంది. దీనిపై ఆ ఫ్రాంచైజీ అధికారికంగా ఐపీఎల్ పాలకమండలికి ఫిర్యాదు చేయడంతో దీనిపై కూడా మూడో కన్ను (థర్డ్ అంపైర్) వేయాలని నిర్ణయించారు. దీంతో ఇక ప్రతీ పరుగు లెక్క ఇక పక్కాగా ఉంటుంది.
టీవీ అంపైర్‌కు నోబాల్...
నోబాల్స్ తరచూ ఆ నోటా ఈ నోటా పేలుతోంది. చర్చనీయాంశమవుతుంది. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఘటనలో వివాదాస్పదం కూడా అవుతోంది. ఫీల్డు అంపైర్లను ఈ నోబాల్ దోషిగా నిలబెడుతోంది. ఈ దోషాన్ని దూరం చేయాలని నిర్ణయించిన పాలకమండలి టీవీ అంపైర్ దీనిపై సమీక్షించే అధికారాన్ని కట్టబెట్టింది.
సూపర్ ఓవర్ గంట దాటదు...
సూపర్ ఓవర్‌కు టైమ్ పీరియడ్ ఉంది. గతంలో ‘టై’ అయితే ఓ సూపర్ ఓవర్ ఆడించేవారు. అక్కడా సమమైతే ఇంకో ఓవర్, అక్కడా విజేత తేలకపోతే మరో ఓవర్.... ఇలా ఇకపై సాగదు. ఏదేమైనా సూపర్ ఓవర్లు గంట దాటడానికి వీల్లేదు. నిర్ణీత 20 ఓవర్ల కోటా అంటే 40వ ఓవర్ ఆఖరి బంతి ముగిసే సమయం నుంచి ఈ గంట మొదలవుతుంది.
90 నిమిషాల్లో 20 ఓవర్లు...
ఐపీఎల్ టి20 మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లు గంటన్నరలో పూర్తి చేయాల్సిందే! అంటే గంటకు కనీసం 14.11 ఓవర్లు నమోదు కావాలి. ప్రతీ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లును 90 (85 నిమిషాలు+5 నిమిషాలు టైమ్ అవుట్) నిమిషాల్లోనే కచ్చితంగా పూర్తి చేయాలి. ఇతర కారణాలతో ఓవర్ల సంఖ్యను కుదించాల్సి వస్తే అప్పుడు ఒక్కో ఓవర్‌ను నాలుగు నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
కాస్త ఆలస్యంగా కోహ్లి...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి చెన్నైలో నిర్వహించే శిబిరంలో వచ్చే నెల 1న చేరనున్నాడు. నిజానికి నేటి (మంగళవారం) నుంచే ఈ శిబిరం మొదలవుతుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్‌సీబీ ఆటగాళ్లు చెన్నై చేరుకోగా... వన్డే సిరీస్‌కు ఎంపికైన చహల్, సిరాజ్ పుణేలో ఆఖరి వన్డే ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అయితే కెప్టెన్ కోహ్లి మాత్రం రెండు రోజుల ఆలస్యంగా బృందంలో చేరతాడు. అలాగే మోర్గాన్, శుబ్‌మన్ గిల్, ప్రసిధ్ కృష్ణ కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లోకి వెళ్లారు.
ముంబై ఏకమైంది...
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆటగాళ్లతో ఏకమైంది. విజయవంతమైన సారథి రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుతో కలిశారు. వీళ్లంతా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగించుకొని ఆ బబుల్ నుంచి ఐపీఎల్ బబుల్‌లోకి బదిలీ అయ్యారు. దీంతో కచ్చితమైన క్వారంటైన్ నిబంధన నుంచి తప్పించుకున్నారు. లేదంటే వారంపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది.
ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, బిల్లింగ్స్, టామ్ కరన్, అక్షర్ పటేల్, క్రిస్ వోక్స్‌లు సోమవారమే ముంబైలో జట్టుతో జతకలిశారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఫ్రాంచైజీ సామాజిక సైట్లలో పోస్ట్ చేసి అభిమానుల్ని అలరించింది. కాగా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భుజం శస్త్రచికిత్స కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. వచ్చే నెల 10న జరిగే తమ తొలి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.
భారత్‌లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నీ జరుగుతుందన్న సంతోషమైతే ఉంది కానీ... స్టేడియానికి వెళ్లి చూసే భాగ్యమైతే లేదు. మనదేశంలో జరిగే మెరుపుల్ని మనం ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం ‘నో ఎంట్రీ’తో దూరమైంది. కోవిడ్–19 పడగలో జరుగుతున్న ఈ సీజన్ బుడగలో ముసుగు (మాస్క్) తొడుక్కుంది. ఏదేమైనా ‘ఏప్రిల్ 9 విడుదల’ ఆటకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సీజన్‌లో కొత్తగా ఐదు నిబంధనలు ప్రవేశపెట్టారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతుండగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకొని అడుగుపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment