
అహ్మదాబాద్: ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం రాహుల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. దాంతో జట్టు ఫిజియో వైద్యం చేసినా అతని శరీరం సహకరించలేదు. దాంతో కేఎల్ రాహుల్‌కు సర్జరీ అనివార్యమవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
‘ నిన్న రాత్రి కేఎల్ రాహుల్ తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా అతను కోలుకోలేదు. దాంతో అతన్ని అత్యవసర రూమ్‌కు తరలించి పలు పరీక్షలు చేశారు. రాహుల్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ అనివార్యమైన నేపథ్యంలో వెంటనే అత్యంత భద్రతా మధ్య అతన్ని ఆసుపత్రికి తరలించాం’ అని ఫ్రాంచైజీ పేర్కొంది.
ప్రస్తుతం ఫ్రాంచైజీ చెబుతున్న దాని ప్రకారం రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ లెక్కన అతను బయో బబుల్ దాటినట్లే. అతను తిరిగొచ్చినా నిబంధనల ప్రకారం మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతేకాకుండా అతనికి సర్జరీ అనివార్యమంటున్నారు. ఒకవేళ సర్జరీ అయితే కనీసం 2-3 వారాల విశ్రాంతి అవసరం కానుంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ టోర్నీలో మిగతా మ్యాచ్‌లకు బరిలోకి దిగుతాడా.. లేదా అనేది ప్రశ్నార్ధకమే.