Photo Courtesy : IPL.Com
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు లక్ష్యాన్ని ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. బెయిర్ స్టో (63* పరుగులు) కడవరకు నిలిచి జట్టును గెలిపించగా.. విలియమ్సన్ 16 పరుగులతో అతనికి సహకరించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం ప్రెజంటేషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు.
''చెన్నైలో మాకు ఇది మొదటి మ్యాచ్.. పిచ్ పరిస్థితి మాకు కొత్త కావడంతో ఇలా ఆడుతామని ఊహించలేదు. కానీ మేము చేసిన స్కోరుకు అదనంగా మరో 10-15 పరుగులు జతచేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఎస్‌ఆర్‌హెచ్ గెలుపుకు వారి బౌలింగ్ ఒక కారణం కావొచ్చు.. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడడంతో పిచ్‌పై అవగాహన వచ్చేసింది. ఇక మా బ్యాటింగ్ ఈరోజు అనుకున్నంత బాలేదు. చేసింది తక్కువ స్కోరైనా మా బౌలర్ల ప్రదర్శన తక్కువ చేయలేము. అయితే వరుసగా మూడు మ్యాచ్‌లు పరాజయం చెందడం తో ఒత్తిడి పెరిగినా.. రానున్న మ్యాచ్‌లపై దాని ప్రభావం లేకుండా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.
అంతకముందు మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతోపాటు అత్యంత వేగంగా 5000 పరుగుల మార్కును అందుకున్న రెండో క్రికెటర్‌గా కూడా చరిత్ర పుటల్లోకెక్కాడు. సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో ఓవర్లో సింగల్ తీయడంతో రాహుల్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
రాహుల్ పొట్టి ఫార్మాట్‌లో 143 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగులు పూర్తి చేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి 167 ఇన్నింగ్స్‌ల్లో, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా 173 ఇన్నింగ్స్‌ల్లో ఆ మార్కును అందుకున్నారు. ఇక ఓవరాల్ టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది.
యూనివర్సల్ బాస్ కేవలం 132 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్కును చేరుకోగా, రాహుల్ 143 ఇన్నింగ్స్‌ల్లో, న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్ 163 ఇన్నింగ్స్‌ల్లో 5000 పరుగులు పూర్తి చేసి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్ధేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది.
చదవండి: అలాంటి పరిస్థితుల్లో గంభీర్‌లా ఆడాలని ఉంటుంది: పడిక్కల్
Comments
Please login to add a commentAdd a comment