
ముంబై: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించడం దాదాపు అసాధ్యమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముంబై ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, పాండ్య సోదరులు అద్భుతంగా రాణించారని, వారి ప్రదర్శనతో ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించారని ఆకాశానికెత్తాడు. ముఖ్యంగా సూర్యకుమార్, ఇషాన్‌లు తొలి అంతర్జాతీయ మ్యాచ్ అడుతున్నామనే ఒత్తిడి ఏమాత్రం లేకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం అద్భుతమని కొనియాడారు.
అలాగే హార్దిక్ తిరిగి బంతిని అందుకోవడం శుభపరిణామమని, ఇది ముంబై జట్టుకే కాకుండా టీమిండియాకు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. వన్డే అరంగేట్రంలోనే అదరగొట్టిన కృనాల్ పాండ్యాపై సైతం సన్నీ ప్రశంసల వర్షం కురిపించాడు. కృనాల్ బ్యాట్‌తో బంతితో రాణించడం జాతీయ జట్టుతో పాటు తన ఫ్రాంచైజీకి కూడా కీలక పరిణామమని అభిప్రాయపడ్డాడు. ముంబై జట్టులో ప్రతి ఒక్కరూ లోడెడ్ గన్‌లను పోలి ఉన్నారని, లీగ్ మొదలుకాగానే బుల్లెట్ల వర్షం కురుస్తుందని కొనియాడాడు. ఇదిలా ఉండగా టీమిండియాలో ఒక్క రాజస్థాన్ రాయల్స్ పేయర్ కూడా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్ అవుతుందని, టీమిండియా స్పినర్లు చహల్(బెంగళూరు), కుల్దీప్(కోల్‌కతా)లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై ఆయా ఫ్రాంఛైజీలు వర్కవుట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై రాళ్ల దాడి
Comments
Please login to add a commentAdd a comment