
సునిల్ గావస్కర్
IPL 2023: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కుంటే ముంబై ఇండియన్స్‌కు అతడి వల్ల ఏమి ఒరిగిందని ప్రశ్నించాడు. ముంబై తనపై వెచ్చించిన ఒక్క రూపాయికి కూడా ఆర్చర్ న్యాయం చేయలేదని.. అతడికి రూ. 8 కోట్ల మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ముందే తెలిసినా
ఐపీఎల్-2022 వేలంలో భాగంగా 8 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధ పడుతున్న ఆర్చర్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని తెలిసినా అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 లీగ్ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో టీ20 క్రికెట్‌లో తిరిగి అడుగుపెట్టిన ఆర్చర్.. ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు ఆడాడు.
జోఫ్రా ఆర్చర్
ఈ క్రమంలో ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. ఎన్నో అంచనాలతో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతడు 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీశాడు. తర్వాత గాయం తిరగబెట్టడంతో మే 9న స్వదేశం ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు.
8 కోట్లు పెడితే ఏం దక్కింది?
ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ జోఫ్రా ఆర్చర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడ్ డేకు రాసిన కాలమ్‌లో.. ‘‘జోఫ్రా ఆర్చర్ వల్ల ముంబై ఇండియన్స్ ఎలాంటి అనుభవం చవిచూసిందో తెలుసు కదా! ఈ సీజన్ నుంచి మాత్రమే అతడు అందుబాటులో ఉంటాడని తెలిసినా గాయపడిన అతడిని కొనుగోలు చేసింది.
అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. కానీ ప్రతిఫలంగా వారికి ఏం లభించింది? అతడు 100 శాతం ఫిట్‌నెస్ సాధించకలేకపోయాడు. కనీసం ఈ విషయం గురించి ముందే ఫ్రాంఛైజీకి సమాచారం ఇవ్వాల్సింది. అపుడైనా వాళ్లకు.. అతడి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని తెలిసేది.
టోర్నీ మధ్యలో చికిత్స కోసమని స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఈసీబీ స్వయంగా చెప్పింది. నిజానికి ఈసీబీ కంటే ముంబై ఫ్రాంఛైజీనే ఆర్చర్‌కు ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. కానీ అతడు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించాడు. యూకేకు తిరిగి వెళ్లినపుడే ఫ్రాంఛైజీ పట్ల అతడి నిబద్ధత ఎలాంటిదో అర్థమైంది’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు ఆర్చర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదని పేర్కొన్నాడు.
చదవండి: అది కూడా కీలకమే.. పాపం రాజస్తాన్ ఆ విషయం మర్చిపోయినట్టుంది!
Comments
Please login to add a commentAdd a comment