photo credit: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ పాక్షికంగా విరామం తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం హిట్‌మ్యాన్‌ను ఉద్దేశిస్తూ సన్నీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శనకు (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) రోహిత్ ఫామ్ కూడా ఓ కారణమని, చిన్న విరామం అనంతరం తిరిగి వస్తే అతని ఆటతీరులో కూడా మార్పు వస్తుందని, ఇలా చేయడం ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.
స్వల్ప విరామం అనంతరం హిట్‌మ్యాన్ ఫ్రెష్‌గా ఆడుకోవచ్చని (ఐపీఎల్ చివరి మ్యాచ్‌ల్లో), ఇలా చేయడం వల్ల అతను డబ్ల్యూటీసీ ఫైనల్‌పై కూడా కాన్సంట్రేట్ చేయవచ్చని తెలిపాడు. ఫామ్‌లో లేని రోహిత్ బ్రేక్ తీసుకోవడం వల్ల గాయాల బారిన పడే ప్రమాదం కూడా తప్పుతుందని, 35 ఏళ్ల రోహిత్‌కు ఇది మేలు చేస్తుందని అన్నాడు. ముంబై ఇండియన్స్‌కు సైతం రోహిత్ గైర్హాజరీలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని, ఇలా జరిగితే వారి ఆటతీరులోనూ మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి, మళ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల బాట పట్టింది. ముంబై వైఫల్యాలకు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం ఓ కారణమైతే, బ్యాటర్ల వరుస వైఫల్యాలు మరో కారణం. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ, గ్రీన్ మినహయించి అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. హిట్‌మ్యాన్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. అతనాడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. వాస్తవానికి రోహిత్ శర్మ స్థాయి ఇది కాదు.
Comments
Please login to add a commentAdd a comment