ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్ 6 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 261 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మెరుపు సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.
ఈ సీజన్‌లో రోహిత్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 43 పరుగులు చేసిన రోహిత్.. ఆతర్వాత సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అనంతరం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన రోహిత్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 24 బంతుల్లో 38 పరుగులు చేసిన రోహిత్.. తాజాగా సీఎస్‌కేపై సెంచరీతో మెరిశాడు.
రోహిత్ ఫామ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. హిట్‌మ్యాన్ ఈ ఏడాది ఆరంభం నుంచే అదరగొడుతున్నాడు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌పై టీ20 సెంచరీ చేసిన రోహిత్.. ఆతర్వాత ఇంగ్లండ్‌పై ఫిబ్రవరిలో ఓ సెంచరీ, మార్చిలో ఇంకో సెంచరీ చేశాడు. రోహిత్ ఏప్రిల్‌లోనూ సెంచరీ చేయడంతో ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల మూడంకెల స్కోర్ తాకిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఏడాది రోహిత్ టెస్ట్‌ల్లో 45.50 సగటున రెండు సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. అంతర్జాతీయ టీ20ల్లో 168.1 స్ట్రయిక్‌రేట్‌తో 60.5 సగటున సెంచరీ సాయంతో 121 పరుగులు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ 167.3 స్ట్రయిక్‌రేట్‌తో 52.2 సగటున 262 పరుగులు సాధించాడు.
రోహిత్ ఈ ఏడాది ఇంకా వన్డే మ్యాచ్ ఆడలేదు. రోహిత్ ఈ ఏడాది టెస్ట్‌ల్లో, టీ20ల్లో ఇరగీయడంతో ఆల్ ఫార్మాట్ స్టార్‌గా మారాడు. ఐపీఎల్‌లో రోహిత్ వ్యక్తిగతంగా రాణిస్తున్నప్పటికీ అతని జట్టు ముంబై ఇండియన్స్ మాత్రం వరుస పరాజయాలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో (4 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ అజేయ సెంచరీతో మెరిసినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment