
దుబాయ్: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకునే హక్కు అభిమానులకు ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. అతని గాయం తీవ్రతను వెల్లడించే విషయంలో బీసీసీఐ మరింత పారదర్శకత చూపించాల్సిందని ఆయన అన్నారు. రోహిత్ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తున్నామని చెబుతూ ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయని బీసీసీఐ... అతని గాయం వివరాలు మాత్రం చెప్పలేదు. పైగా మూడు ఫార్మాట్‌ల కోసం జట్టును ప్రకటించిన కొద్దిసేపటికే నెట్స్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అతని ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ పెట్టింది. దాంతో రోహిత్ ఎంపిక కాకపోవడంపై మరింత సందేహాలు పెరిగాయి.(చదవండి: ఫుల్ స్వింగ్‌లో రోహిత్..)
ఈ విషయంపై స్పందించిన గావస్కర్... ‘ఐపీఎల్ జట్లు వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ తమ కెప్టెన్ గాయం విషయాలు బయటకు చెప్పకపోవడంలో అర్థం ఉంది. కానీ అతడిని భారత బ్యాట్స్‌మన్ కోణంలో చూడాలి. రోహిత్ గాయం విషయంలో సరిగ్గా ఏం జరిగిందో చెబితే బాగుండేది. సగటు భారత క్రికెట్ అభిమానికి తమకు ఇష్టమైన క్రికెటర్ గురించి తెలుసుకునే హక్కు ఉంది. అతను ముంబై ఇండియన్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన మాట వాస్తవమే అయితే... అతని గాయం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా అంత తీవ్రమైనదే అయితే అతను కనీసం ప్యాడ్‌లు కూడా కట్టుకోడు’ అని వ్యాఖ్యానించారు. కాగా అక్టోబర్ 18న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన రోహిత్... ముంబై జట్టు తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో కూడా రోహిత్ ఆడేది అనుమానంగా ఉంది.(చదవండి: ధోని ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈవో గుడ్‌న్యూస్!)
Comments
Please login to add a commentAdd a comment