ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య భారీ అంచనాల నడుమ నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఆసక్తికర సమరంలో ఓ విషయం హైలైట్ అయ్యింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాళ్లను ఇరు ఫ్రాంచైజీలు బెంచ్‌కే పరిమితం చేసి పెద్ద సాహసమే చేశాయి. ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు) లేకుండా, సీఎస్‌కే మొయిన్ అలీ (రూ. 8 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) లేకుండా బరిలోకి దిగి అభిమానులతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి.
వీరు ముగ్గురు తుది జట్టులో లేకపోవడానికి గల కారణాలను సంబంధిత కెప్టెన్లు టాస్ సమయంలో వెల్లడించినప్పటికీ, అవి పొంతనలేనివిగా తెలుస్తోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తమ ఆటగాడు ఆర్చర్ గాయపడ్డాడని తొలుత చెప్పి, ఆతర్వాత ముందు జాగ్రత్త చర్యగా అతనికి రెస్ట్ ఇచ్చామని చెప్పగా.. సీఎస్‌కే సారధి ధోని తమ ఆటగాళ్లు మొయిన్ అలీ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడని, స్టోక్స్ మడమ గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు.
32.25 కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్ల విషయంలో కెప్టెన్లు ఎన్ని స్టేట్‌మెంట్లు ఇచ్చినా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సదరు ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తి చెందని ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగానే గాయాల సాకు చూపించి వారి తప్పించినట్లు తెలుస్తోంది. మొయిన్ అలీ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి 17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 23 పరుగులు చేయగా, లక్నోపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, 4-0-26-4) అదరగొట్టాడు.
మొయిన్ అలీ నిజంగా అనారోగ్యం బారిన పడ్డాడని వదిలేస్తే, ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడనుకున్న స్టోక్స్ మాత్రం ఆడిన 2 మ్యాచ్‌ల్లో తేలిపోయి, తనపై గంపెడాశలు పెట్టుకున్న ఫ్రాంచైజీని, అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. స్టోక్స్ గుజరాత్‌పై 6 బంతుల్లో ఫోర్ సాయంతో 7 పరుగులు, లక్నోపై 8 బంతుల్లో ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఆర్చర్ విషయానికొస్తే, భారీ అంచనాల నడుమ ఓ సీజన్ ముందుగానే బుక్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్లీష్ బౌలర్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక నిరాశపరిచాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు కనీసం నామమాత్ర ప్రదర్శన కూడా చేయకుండా చేతులెత్తేస్తుండటంతో ఫ్రాంచైజీ వారిని తప్పించే సాహసం చేయక తప్పలేదు.
అయితే, ఈ విషయంలో ముంబై మాట అటుంచితే, సీఎస్‌కే మాత్రం సత్ఫలితం రాబట్టిందనే చెప్పాలి. మొయిన్ అలీ, స్టోక్స్ లేకపోయిన టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన వెటరన్ అజింక్య రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను తుది జట్టులోకి తీసుకునే సీఎస్‌కే సక్సెస్ సాధించింది. అతనితో పాటు జడేజా (3/20), సాంట్నర్ (2/28), తుషార్ దేశ్‌పాండే (2/31), మగాలా (1/37), రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్) రాణించడంతో ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment