కుల్దీప్ యాదవ్(ఫొటో: ట్విటర్)
Kuldeep Yadav Comments On KKR Camp: ప్రతిభ, అనుభవం ఉండి కూడా తుదిజట్టులో చోటు దక్కకపోతే ఏ ఆటగాడైనా నిరాశ చెందడం సహజం. ఆడే అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం ఒక్కోసారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకలా జరుగుతుందో సరైన కారణం తెలియక మానసిక వేదనకు గురయ్యే పరిస్థితి వస్తుంది. టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు.
సుదీర్ఘకాలంగా భారత తుది జట్టులో చోటు కోసం ఎదురుచూసిన అతడు ఎట్టకేలకు.. ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండోటెస్టుతో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎదురుచూపులే. ఇక జాతీయ జట్టులో పరిస్థితి ఇలా ఉంటే... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ గడ్డు స్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ చైనామన్ బౌలర్. ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్ యాదవ్‌కు యాజమాన్యం ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించడం లేదు.
ముఖ్యంగా స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. దీంతో కుల్దీప్‌నకు మొండిచేయే ఎదురైంది. ఇక కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2021 రెండో దశ సెప్టెంబరు 19 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల్దీప్ యాదవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అసలు ఎందుకు పక్కనపెట్టారో అర్థం కాదు..
‘‘ఆటగాళ్లతో కోచ్‌లు సుదీర్ఘకాలం పాటు టచ్‌లో ఉంటే.. వారి ప్రతిభ ఏమిటో అంచనా వేయగలుగుతారు. కానీ, కమ్యూనికేషనే సరిగ్గా లేకపోతే కష్టం కదా. కొన్ని సందర్భాల్లో అసలు మనం తుదిజట్టులో ఉన్నామో లేదో తెలియదు. వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం కాదు. తుదిజట్టులో చోటుకు మనం అర్హులమేనని మనసు చెబుతూ ఉంటుంది. టీం కోసం శాయశక్తులు ఒడ్డి గెలిపించగలమని అనిపిస్తుంది. కానీ.. అకస్మాత్తుగా మనల్ని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాదు’’ అని కుల్దీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అపుడైతే వెళ్లి అడిగేవాడిని..
ఇక టీమిండియా, ఐపీఎల్‌లో పరిస్థితికి గల తేడాల గురించి చెబుతూ... ‘‘జాతీయ జట్టులో చోటు దక్కకపోతే.. అలా ఎందుకు జరిగిందో మనకో సమాధానం దొరుకుతుంది. కానీ.. ఐపీఎల్‌లో అలా కాదు. ఐపీఎల్ ఆరంభమైన సమయంలో ఒకే ఒకసారి ఫ్రాంఛైజీతో మాట్లాడాను. ఆ తర్వాత అసలు కమ్యూనికేషన్ లేదు. ఎందుకు పక్కన పెట్టారో వివరణ దొరకలేదు. చాలా షాకింగ్‌గా ఉంటుంది. నా నైపుణ్యం పట్ల వారికి నమ్మకం లేదేమో అనిపిస్తుంది. కేకేఆర్‌కు చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు కదా. బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువే. అందుకేనేమో ఇలా’’ అంటూ తనను తుదిజట్టులో ఆడించకపోవడం గురించి కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ కెప్టెన్ అయితే అడగొచ్చు.. కానీ..
ఐపీఎల్‌లో స్వదేశీ, విదేశీ కెప్టెన్ల గురించి కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా కెప్టెన్‌తో కమ్యూనికేషన్ మేలు చేస్తుంది. అసలు ఇయాన్ మోర్గాన్‌కు నా గురించి, నా ఆట గురించి ఏం తెలుసో నాకు తెలియదు. కొన్నిసార్లు మా మధ్య మాటలే ఉండవు. ఒకవేళ అతడి స్థానంలో ఇండియన్ కెప్టెన్ ఉన్నట్లయితే.. కాస్త చొరవ తీసుకుని.. నన్ను ఎందుకు ఆడించడం లేదని అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. రోహిత్ శర్మ నా కెప్టెన్ అయితే.. జట్టులో నా పాత్ర ఏమిటి? నా నుంచి మీరేం ఆశిస్తున్నారు. ఆటను ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉందా? తదితర విషయాల గురించి స్వేచ్ఛగా చర్చించే వీలు కలుగుతుంది’’ అని పేర్కొన్నాడు.
-వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment