Courtesy : IPL Twitter
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా పృథ్వీ షా(21 ఏండ్ల, 169 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్(20ఏండ్ల 218 రోజులు ) మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్(21 ఏండ్ల 183 రోజులు), నాలుగో స్థానంలో కేకేఆర్ ఆటగాడు శుబ్‌మన్ గిల్(21 ఏండ్ల 222 రోజులు), ఐదో స్థానంలో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి( 22 ఏండ్ల 175 రోజులు) ఉన్నారు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను షా అధిగమించాడు.
కాగా పృథ్వీ షా 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటి వరకు 44 మ్యాచ్‌ల్లో 1013 పరుగులు సాధించాడు. అందులో 8 అర్ధశతకాలు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో డకౌట్ అయి తీవ్ర విమర్శల పాలయ్యాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు సెంచరీలతో పరుగుల వరద పారించి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ధావన్‌కు జోడీగా వస్తున్న పృథ్వీ మెరుగైన ఆరంభాలను ఇస్తూ ఢిల్లీ విజయాలలో కీలకంగా మారాడు.
ఇక ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్ పటిదార్ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్ పంత్ (48 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు), షిమ్రాన్ హెట్‌మైర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న కేకేఆర్‌తో తలపడనుంది.
చదవండి: సిక్స్ ఇలా కొట్టాలి.. రిషభ్‌తో కోహ్లి ముచ్చట
Comments
Please login to add a commentAdd a comment