ఔర్‌ ఏక్‌ దాల్‌ చహల్‌.. దెబ్బకు వికెట్‌ పడింది! | IPL 2021 RCB Vs PBKs Chahal Dismisses Shahrukh Khan On Kohli Suggestion | Sakshi
Sakshi News home page

ఔర్‌ ఏక్‌ దాల్‌ చహల్‌.. దెబ్బకు వికెట్‌ పడింది!

Published Sat, May 1 2021 12:34 PM | Last Updated on Sat, May 1 2021 7:23 PM

IPL 2021 RCB Vs PBKs Chahal Dismisses Shahrukh Khan On Kohli Suggestion - Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-2021లో ఇంతవరకు తన స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్‌ యజువేంద్ర చహల్‌. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లోనూ వేసిన తొలి రెండు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. దీంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలో చహల్‌ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా అతడిపై ఫైర్‌ అయ్యారు. 

అయితే, మలి రెండు ఓవర్లలో మాత్రం ఆరు పరుగులే ఇచ్చిన చహల్‌.. ఒక వికెట్‌ తీయడంతో వారు కాస్త శాంతించారు. కాగా 15వ ఓవర్‌లో చహల్‌ అద్భుతమైన గూగ్లీతో పంజాబ్‌ ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అది కూడా కెప్టెన్‌ కోహ్లి సలహాతోనే. అంతకు ముందు షారుఖ్‌కు ఇదే రకమైన బంతిని సంధించిన చహల్‌.. ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా మొండిచేయి ఎదురైంది. దీంతో, అతడు నిరాశకు లోనుకాగా, కోహ్లి వెంటనే స్పందించి.. ఫీల్డ్‌ సెట్‌ చేసి, ఔర్‌ ఏక్‌ దాల్‌(ఇంకోటి అలాగే వేసెయ్‌) అంటూ ఉత్సాహపరిచాడు.

ఈ క్రమంలో, చహల్‌ వేసిన రెండో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన షారుఖ్‌ రాంగ్‌ షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఆర్సీబీ 34 పరుగులతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(35), రజత్‌ పాటిదార్(31)‌, హర్షల్‌ పటేల్‌(31) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో బెంగళూరు విజయాలకు బ్రేక్‌ పడింది.

చదవండి: వైరల్‌: హర్‌ప్రీత్‌ బ్రార్‌ భుజం తట్టిన కోహ్లి.. నెటిజన్లు ఫిదా
RCB Vs PBKs: పంజాబ్‌కు ‘ప్రీత్‌’పాత్ర విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement