ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విన్నింగ్ షాట్ బౌండరీగా బాది తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను చెన్నై ఆటగాళ్లు ఊహించని రీతిలో సత్కరించారు. మ్యాచ్ అనంతరం పంత్ పెవిలియన్ చేరుకునే క్రమంలో చెన్నై ఆటగాళ్లు అతన్ని ఘనంగా సన్మానించారు. పంత్ ముందు నడుస్తుండగా చెన్నై సభ్యులు అతని వెనుకనడుస్తూ అతనికి జేజేలు పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే తాజాగా పంత్‌కు సంబంధించిన మరో ఫోటో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో చెన్నై జట్టు గెలుపు సంబురాలు చేసుకుంటున్న తరుణంలో ప్రత్యర్ధి జట్టు సభ్యుడైనా పంత్, వారితో కలిసి సంబురాల్లో పాలుపంచుకుంటున్న ఫోటో అది. పంత్ అభిమానులు ఈ ఫోటోను, గత మ్యాచ్‌లో పంత్‌కు జరిగిన సన్మానికి సంబంధించిన ఫోటోను పోల్చుతూ రకరకాల కామెంట్లు చేశారు. ఇతరుల గెలుపును కూడా సెలబ్రేట్ చేసుకోగలిగితే, మనకు కూడా ఓ రోజు వస్తుంది. ఆ రోజు పంత్‌కు త్వరగా వచ్చిందంటూ కామెంట్లు చేశారు. ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ అభిమానులు చేస్తున్న హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇదిలా ఉండగా, టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ రిషబ్ పంత్‌కు 2021 సంవత్సరం బాగా కలిసొచ్చింది. గతేడాది ఆసీస్ పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ 23 ఉత్తరాఖండ్ కుర్రాడు.. ఆ సిరీస్ మొత్తంలో అదరగొట్టి, టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి నుంచి వెనుతిరిగి చూడని ఈ ఢిల్లీ డైనమైట్ అంచలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఈ క్రమంలో అతనికి మరో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా గాయపడంతో అతని స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లక్కీ ఛాన్స్ పంత్‌కు దొరికింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే తన ఆరాధ్య ఆటగాడు మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన అతను.. గురువు(ధోని)తో సహా అందరి మన్ననలను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment