Kohli 71 Runs Away To Achieve Rare Milestone In T20 Cricket: ఐపీఎల్-2021 సెకండ్ ఫేస్‌లో సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ ఇతర భారత బ్యాట్స్‌మెన్‌కూ సాధ్యం కాని ఈ రికార్డుకు కోహ్లి కేవలం 71 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి నేటి మ్యాచ్‌లో ఆ పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటరగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్‌మెన్ రికార్డుల్లోకెక్కుతాడు. భారత జట్టుతో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున మొత్తం 311 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఇప్పటివరకు 133.95 స్ట్రైక్ రేట్‌తో 9929 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం పొట్టి క్రికెట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 446 మ్యాచ్‌ల్లో 14,261 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 22 సెంచరీలు, 87 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను 561 మ్యాచ్‌ల్లో సెంచరీ, 56 హాఫ్ సెంచరీల సాయంతో 11,159 పరుగులు సాధించాడు. వీరి తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (436 మ్యాచ్‌ల్లో 10,808 పరుగులు), ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ (304 మ్యాచ్‌ల్లో 10,017 పరుగులు) వరుసగా 3,4 స్థానాల్లో ఉన్నారు.
మరోవైపు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు రికార్డు కూడా కోహ్లి పేరిటే నమోదై ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 199 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 5 శతకాలు, 40 అర్ధశతకాల సాయంతో 6076 పరుగులు స్కోర్ చేశాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే.. తొలిదశలో జరిగిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఆర్సీబీ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: మంచి పొజిషిన్‌లో ఉన్నారు.. ఇప్పుడిలా ఎందుకు కోహ్లి: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment