IPL 2022 Auction: Top 10 Players List Sold for Above 10 Crore on Day 1 - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction Day 1: చహర్‌ 14 కోట్లు... శార్దుల్‌ 10 కోట్ల 75 లక్షలు.. అదరగొట్టిన హసరంగ.. వీళ్లకు 10 కోట్లకు పైగానే! 

Published Sun, Feb 13 2022 9:02 AM | Last Updated on Sun, Feb 13 2022 11:07 AM

IPL 2022 Auction Day 1: Top 10 Players List Sold For Above 10 Crore - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలం మరోసారి అంచనాలను దాటి రికార్డులను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 10 మంది ఆటగాళ్లు కనీసం రూ. 10 కోట్లకంటే ఎక్కువ విలువ పలకగా, పెద్ద సంఖ్యలో ప్లేయర్లు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటారు. గతంతో పోలిస్తే ఈసారి వేలంలో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టాప్‌–10లో ఏడుగురు భారత ఆటగాళ్లు ఉండగా... ఆ పది మందిలో ఏడుగురు బౌలర్లే ఉండటం లీగ్‌లో బౌలింగ్‌ విలువను కూడా చూపించింది.

వేలంలో ఎప్పటిలాగే కొన్ని అనూహ్య, అసాధారణ అంకెలు ఆశ్చర్యపరచగా... అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఫ్రాంచైజీలు ఆచితూచి వేసిన అడుగుల ముద్ర కూడా కనిపించింది. 23 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌ అందరికంటే ఎక్కువగా రూ.15 కోట్ల 25 లక్షలతో శిఖరాన నిలిచాడు. ఐపీఎల్‌ వేలం చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ (రూ. 16 కోట్లు; 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌) తర్వాత రెండో ఖరీదైన భారతీయ ప్లేయర్‌గా ఇషాన్‌ కిషన్‌ గుర్తింపు పొందాడు.

టాప్‌–10 (కనీసం రూ. 10 కోట్లు)
ఇషాన్‌ కిషన్‌ - ముంబై ఇండియన్స్‌  
ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్, వికెట్‌ కీపర్‌. 23 ఏళ్ల వయసు, ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ఈ జార్ఖండ్‌ ప్లేయర్‌ సొంతం. గత రెండేళ్లు ముంబైకి విజయాలు అందించడంలో కీలక పాత్ర. అందుకే ప్రతీ జట్టు అతని కోసం పోటీ పడ్డాయి. అంబానీ టీమ్‌ కూడా అతడిని వదలదల్చుకోలేదు. అందుకే అందరికంటే ఇషాన్‌కు ఎక్కువ విలువ.  రూ. 15 కోట్ల 25 లక్షలు  

దీపక్‌ చహర్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌- రూ. 14 కోట్లు
పవర్‌ప్లే స్పెషలిస్ట్‌ బౌలర్‌. స్వింగ్‌ అతని బలం. చెన్నైకి ఆడిన గత నాలుగు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. అందుకే రాజస్తాన్‌కు చెందిన దీపక్‌ చహర్‌ను చెన్నై మళ్లీ తీసుకుంది. 

శ్రేయస్‌ అయ్యర్‌ -కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - రూ. 12 కోట్ల 25 లక్షలు   
ప్రతిభావంతుడైన బ్యాటర్‌. పరిస్థితికి తగినట్లుగా తన ఆటను మార్చుకోగలడు. ముంబై రంజీ జట్టు నుంచి వచ్చిన సహజ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కెప్టెన్‌ అవసరం ఉన్న కోల్‌కతా అందుకే ఎంచుకుంది.  

శార్దుల్‌ ఠాకూర్‌ - ఢిల్లీ క్యాపిటల్స్‌ - రూ. 10 కోట్ల 75 లక్షలు 
ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్‌గా మారిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఇటీవలి అతని ప్రదర్శనలు అందరి దృష్టినీ ఆకర్షించేలా చేశాయి. కీలక సమయాల్లో వికెట్లు తీసే బౌలింగ్‌ నేర్పుతో పాటు చివర్లో ధాటిగా బ్యాటింగ్‌ చేయగల నైపుణ్యం ఈ ముంబైకర్‌ సొంతం.  

హర్షల్‌ పటేల్‌ - బెంగళూరు - రూ. 10 కోట్ల 75 లక్షలు 
2021 ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. పవర్‌ప్లేలో, డెత్‌ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్‌ చేయగలడు. అందుకే భారీ మొత్తానికి ఈ హరియాణా బౌలర్‌ను బెంగళూరు మళ్లీ తీసుకుంది. 

వనిందు హసరంగ- బెంగళూరు -రూ. 10 కోట్ల 75 లక్షలు 
ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లలో ఆకట్టుకుంటున్న ఈ శ్రీలంక స్పిన్నర్‌ టి20 ప్రపంచకప్‌లో, 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. అయినా ఒక భారతీయేతర స్పిన్నర్‌ ఇంత విలువ పలకడం అనూహ్యం. అయితే లెగ్‌స్పిన్నర్‌గా అతనిది ప్రత్యేక శైలి. ‘గుగ్లీ’ పదునైన ఆయుధం.

నికోలస్‌ పూరన్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రూ. 10 కోట్ల 75 లక్షలు
ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే అసాధారణ విలువ. ఈ వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌కు హిట్టర్‌గా పేరు ఉన్నా గతంలో పంజాబ్‌ జట్టుకు ఉపయోగపడలేదు. హైదరాబాద్‌ అనూహ్య మొత్తాన్ని వెచ్చించింది.

లోకీ ఫెర్గూసన్‌ - గుజరాత్‌ టైటాన్స్‌ - రూ. 10 కోట్లు 
న్యూజిలాండ్‌కు చెందిన సూపర్‌ ఫాస్ట్‌ బౌలర్‌. కోల్‌కతా తరఫున మూడు సీజన్లలో అక్కడక్కడ రాణించాడు. అతని స్థాయికి, అంతర్జాతీయ గుర్తింపునకు ఇది చాలా పెద్ద మొత్తం.  

అవేశ్‌ ఖాన్‌ - లక్నో సూపర్‌ జెయింట్స్‌ - రూ. 10 కోట్లు 
చాలా రోజులుగా భారత క్రికెట్‌లో అందరి దృష్టీ ఉంది. 2016 అండర్‌–19 ప్రపంచకప్‌లో ఆడిన ఈ మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ భారత యువ పేస్‌ బౌలర్లలో చక్కటి ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కూడా ఆకట్టుకోవడంతో ఫ్రాంచైజీలు ఇతని కోసం పోటీ పడ్డాయి. 

ప్రసిధ్‌ కృష్ణ - రాజస్తాన్‌ రాయల్స్‌ - రూ. 10 కోట్లు
ఐపీఎల్‌లో గొప్ప రికార్డు లేకపోయినా (9.26 ఎకానమీ) ఇటీవలి వన్డే ప్రదర్శన ప్రసిధ్‌ కృష్ణకు భారీ మొత్తం అందించింది. తాజా ఫామ్‌లో ఈ కర్ణాటక బౌలర్‌ ప్రత్యరి్థని కట్టడి చేయగలడని ఫ్రాంచైజీలు నమ్మాయి.   

చదవండి: IPL 2022 Auction: వయసు 37.. ధర 7 కోట్లు.. ఆర్సీబీ సొంతం.. మంచి డీల్‌.. మా గుండె పగిలింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement