IPL 2022 Mega Auction- Dewald Brewis: దక్షిణాఫ్రికా యువ కెరటం డెవాల్డ్ బ్రెవిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి రోజు మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది. మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ‘బేబీ ఏబీడీ’ని సొంతం చేసుకుంది. కాగా ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో బ్రెవిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ మెగా ఈవెంట్‌లో మొత్తంగా 58.88 సగటుతో 530 పరుగులు సాధించాడు.
ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా... అండర్ 19 వరల్డ్‌కప్ టోర్నీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డు అధిగమించాడు. ఇక ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌లో 45 బౌండరీలు, 18 సిక్సర్లు బాదిన యువ సంచలనం బ్రెవిస్‌ను అభిమానులు ముద్దుగా ఏబీ డివిలియర్స్ 2.0, బేబీ ఏబీడీ అని పిలుచుకుంటున్నారు.
కాగా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయడానికి కూడా బ్రెవిస్ సిద్ధంగా ఉంటాడు. మిడిల్ ఓవర్లలో ఈ రిస్ట్ స్పిన్నర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. కాగా ఐపీఎల్ ఆడాలని ఉందని, ఒకవేళ అవకాశం వస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడతానని బ్రెవిస్ ఇటీవల తన మనసులోని మాట బయటపెట్టాడు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ తనకు ఇష్టమైన ప్లేయర్లు అని పేర్కొన్నాడు.
మరోవైపు.. రిటెన్షన్‌లో భాగంగా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై వదిలేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బేబీ ఏబీడీ.. అతడి స్థానాన్ని భర్తీ చేయగలడని విశ్లేషకులు అంటున్నారు. ఇక కృనాల్‌ను లక్నో ఫ్రాంఛైజీ 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. తొలిరోజు వేలంలో ముంబై ఇషాన్ కిషన్ : రూ. 15 కోట్ల 25 లక్షలు, డెవాల్డ్ బ్రెవిస్: రూ. 3 కోట్లు, మురుగన్ అశ్విన్: రూ. 1 కోటి 60 లక్షలు, బాసిల్ థంపి: రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2022 Auction Day 1: ఆ ఇద్దరి కోసం భారీగా ఖర్చు చేసిన ఆర్సీబీ...! తొలిరోజు కొన్న ప్లేయర్లు వీరే
Comments
Please login to add a commentAdd a comment