PC: BCCI
IPL 2022 Season: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్‌కు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు సమాచారం. ఈ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేసిన అహ్మదాబాద్ జట్టు వచ్చే సీజన్‌లో పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ సీవీసీ క్యాపిటల్ లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే లక్జెంబర్గ్‌కు చెందినది. అయితే, వీటికి అనుబంధంగా సిసల్, టిపికో కంపెనీలు ఉన్నాయి. వీటిలో సిసల్ బెట్టింగ్ గేమింగ్, పేమెంట్స్ కంపెనీ కాగా... టిపికో స్పోర్ట్స్' బెట్టింగ్, ఆన్‌లైన్ కంపెనీ.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ... సీవీసీ క్యాపిటల్‌ను లీగ్‌లోకి అనుమతించడంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ‘‘బెట్టింగ్ కంపెనీలు కూడా ఐపీఎల్ జట్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొత్త రూల్ అనుకుంటా. పెద్ద బెట్టింగ్ కంపెనీ ఒకటి ఐపీఎల్‌లో అడుగుపెడుతోందట. బీసీసీఐ అసలు ఏం చేస్తోంది? అవినీతి నిరోధక విభాగం ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది’’ అని ట్విటర్ వేదికగా అసహనం వెళ్లగక్కారు.
ఈ పరిణామాల నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్‌కు సంబంధించి బీసీసీఐ విచారణ చేపట్టింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్-2022లోకి ఆ కంపెనీకి చెందిన అహ్మదాబాద్ జట్టు ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. సీవీసీకి యూరోపియన్ ఫండ్, ఏసియన్ ఫండ్ రెండూ ఉన్నాయని.. ఇందులో కేవలం యూరోపియన్ ఫండ్ మాత్రమే బెట్టింగ్ కంపెనీలతో అనుసంధానమై ఉందని.. ఏసియన్ ఫండ్‌కు వీటితో ఏమాత్రం సంబంధం లేదని తేలినట్లు సమాచారం.
దీంతో ఏసియన్ ఫండ్ నుంచి సీవీసీ ఐపీఎల్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపినందున.. చట్టప్రకారం ఈ మేరకు ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు... బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అవును... ముగ్గురు సభ్యులతో కూడిన లీగల్ కమిటీ సీవీసీ క్యాపిటల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పంద పత్రం(లెటర్ ఆఫ్ ఇంటెంట్) సమర్పించిన తర్వాత తదుపరి ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయి’’ అని పేర్కొన్నారు.
కాగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి సంబంధించిన సమస్య కారణంగానే మెగా వేలం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు అడ్డంకులు తొలగడంతో త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఇక కొత్త జట్లు లక్నోకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌కు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా రూ. 5,625 కోట్లకు సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: "గంగూలీ నీ పని నువ్వు చూసుకో.. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు"
Comments
Please login to add a commentAdd a comment