పుణే: గుజరాత్ టైటాన్స్ ఛేదనలో డేవిడ్ మిల్లర్ జోరు మీదున్నా... 17 ఓవర్ల దాకా మ్యాచ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనే ఉంది. 170 పరుగుల లక్ష్యంలో 122/5 స్కోరు విజయానికి దూరం! 18 బంతుల్లో 48 పరుగుల కష్టమైన సమీకరణం. కానీ మిల్లర్‌ను మించిన రషీద్ ఖాన్ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ను చెన్నై చేతుల్లోంచి గుజరాత్ లాగేసుకుంది. 18వ ఓవర్ వేసిన జోర్డాన్‌ను ఇష్టమొచ్చినట్లుగా రషీద్ ఆడేసుకున్నాడు.
బంతుల్ని ఎలా వేసినా... విరుచుకుపడటంతో 6, 6, 4, 6, 1, 2లతో 25 పరుగులొచ్చాయి. సమీకరణం కాస్తా 12 బంతుల్లో 23 పరుగులుగా సులభమైంది. తర్వాత ఓవర్లో బ్రేవో... రషీద్‌ను అవుట్ చేసినా మిగతా కథను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయంగా ముగించాడు. చెన్నై గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ గర్జించింది. చివరకు 3 వికెట్ల తేడాతో చెన్నై అనూహ్యంగా ఓటమి పాలైంది. కాగా గాయం కారణంగా గుజరాత్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఆడలేదు. రషీద్ ఖాన్ గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
శ్రమించిన రుతురాజ్
మొదట చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 73; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్ ఉతప్ప (2), టాపార్డర్‌లో మొయిన్ అలీ (1) నిరాశ పరిస్తే... రాయుడు (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రుతురాజ్ మూడో వికెట్‌కు 92 పరుగులు జతచేశాడు. శివమ్ దూబే (19; 2 ఫోర్లు), జడేజా (22 నాటౌట్; 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. తర్వాత గుజరాత్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. లక్ష్యఛేదనలో ఓపెనింగ్ నుంచి ఆరో వరుస బ్యాటర్ దాకా ఒక్క మిల్లర్‌ను మినహాయిస్తే ఐదుగురు బ్యాటర్లు అంతా కలిసి చేసిన స్కోరు 29! సాహా (11), గిల్ (0), శంకర్ (0), అభినవ్ (12), తెవాటియా (6) చేతులెత్తేస్తే మిల్లర్ సూపర్ ఆటతో గెలిపించాడు.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ రాయల్స్ X కోల్‌కతా నైట్‌రైడర్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment