
PC: IPL
IPL 2022 Mega Auction: మెగా వేలానికి తేదీలు ఖరారు చేసిన గవర్నింగ్ కౌన్సిల్!
IPL 2022 Mega Auction Date And Venue: క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) ఆదివారం నాటి సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ముందుగా ఊహించినట్లుగానే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది.
అదే విధంగా ఈ సమావేశంలో భాగంగా లీగ్‌లో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ ఎంట్రీకి సంబంధించి బీసీసీఐ నియమించిన కమిటీ అందించిన నివేదికను పాలక మండలి పరిశీలించినట్లు తెలుస్తోంది. రిపోర్టును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పదో జట్టుగా సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ లీగ్‌లో చేరేందుకు జీసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటికే 8 ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టు సమర్పించగా.. రానున్న సీజన్‌లో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త జట్లు ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు డిసెంబరు 25ను తుది గడువుగా నిర్ణయించారు.
చదవండి: IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంఛైజీకి గుడ్‌న్యూస్.. ఆ సమస్యలన్నీ తొలగినట్లే.. ఇక!
అయితే, అహ్మదాబాద్‌కు సంబంధించిన చట్టపరమైన చిక్కులు వీడిపోనున్న నేపథ్యంలో తాజాగా కొత్త డేట్లను జీసీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా మీడియా రైట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అంతేగాక కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్లాన్ బిని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది.