ముంబై ఇండియన్స్ జట్టు(PC: IPL/ Mumbai Indians)
ఓవైపు టపా టపా వికెట్లు పడుతున్నాయి.. 10 ఓవర్లలో నూటొక్క పరుగులు చేయాలి.. ఓపికగా ఆడుతూ లక్ష్యం వైపు పయనించారు బ్యాటర్లు.. ఇక 16 బంతుల్లో 21 పరుగులు చేయాలి.. మరో నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్ ఏమాత్రం అవకాశం ఇచ్చినా చాలు.. ఉతికి ఆరేస్తారు బ్యాటర్లు.. ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఇదే పనిచేశారు.
ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలినా లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పట్టుదలగా నిలబడ్డారు. 18వ ఓవర్లో డానిల్ సామ్స్ రూపంలో వారికి చక్కటి అవకాశం లభించింది. అతడి బౌలింగ్‌లో వరుసగా మొత్తంగా 24(6,1,6,4,1,6) పరుగులు సాధించారు. తద్వారా ఢిల్లీని విజయ తీరాలకు చేర్చారు. ఇక కీలక సమయంలో డానియల్ చేతికి బంతిని ఇచ్చిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఇదే మాట అంటున్నాడు. డానియల్‌తో 18వ ఓవర్లో బౌలింగ్ చేయించడం ముంబై చేసిన అతిపెద్ద తప్పిదమని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మ్యాచ్‌ను విశ్లేషిస్తూ.. ‘‘లలిత్ యాదవ్ బాగా ఆడాడు. శార్దూల్ ఠాకూర్ తన వంతు సహకారం అందించాడు. అక్షర్ పటేల్ ఏకంగా 200 స్ట్రైక్ రేటుతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ప్రదర్శన ఇలా ఉంటే.. ముంబై కొన్ని తప్పిదాల వల్ల చతికిలపడింది.
ముఖ్యంగా డేనియల్ సామ్స్‌కు 18వ ఓవర్‌లో బంతిని ఇవ్వడం అతి పెద్ద తప్పిదం. టైమల్ మిల్స్ లేదంటే.. బుమ్రాను తీసుకురావాల్సింది. కానీ అలా జరుగలేదు. వెరసి 18 ఓవర్లో ఢిల్లీకి 24 పరుగులు వచ్చాయి. బుమ్రా కూడా మరీ అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. అదే వారి విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన డానియల్ సామ్స్ 57 పరుగులు ఇవ్వగా.. బుమ్రా 3.2 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరూ ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. బాసిల్ థంపి 3, మురుగన్ అశ్విన్ 2, టైమల్ మిల్స్ ఒక వికెట్ పడగొట్టారు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
ముంబై- 177/5 (20)
ఢిల్లీ- 179/6 (18.2)
4 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
Comments
Please login to add a commentAdd a comment