Viral Video: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా శనివారం (ఏప్రిల్ 2) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, బట్లర్ (68 బంతుల్లో 100; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్), తిలక్ వర్మ (33 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్ల ముగిసే సరికి ముంబై 8 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసి లీగ్‌లో వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకోగా, రాజస్థాన్ రాయల్‌గా రెండో విజయాన్ని నమోదు చేసి, టేబుల్ టాపర్‌గా నిలిచింది.
— Diving Slip (@SlipDiving) April 2, 2022
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో యువ బ్యాటర్ తిలక్ వర్మ కొట్టిన ఓ భారీ సిక్సర్.. మైదానంలో లైవ్ కవరేజ్ చేస్తున్న కెమెరామెన్ తలకు దగ్గరగా వెళ్లింది. అయితే అతని అదృష్టం బాగుండటంతో బంతిని ముందుగానే గమనించి తలను పక్కకు తీశాడు. దీంతో వేగంగా దూసుకొచ్చిన బంతి అతని భుజానికి తగిలింది. కెమెరామెన్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో తిలక్ వర్మ, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ సహా అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 12.5వ ఓవర్ (రియాన్ పరాగ్) సందర్భంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ (61).. ముంబై ఇండియన్స్ తరఫున అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
చదవండి: తిలక్ వర్మపై రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment