బ్రెవిస్ క్యాచ్ వదిలేసిన పంత్
ముంబై: సీజన్ ఆసాంతం నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్‌లో అభిమానుల్ని మురిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచి... రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ప్లేఆఫ్స్‌కు పంపింది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రోహిత్ బృందం 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చేజేతులా ఓడి లీగ్ దశకే పరిమితమైంది. పేలవ ఫీల్డింగ్‌కుతోడు కెప్టెన్ పంత్ నాయకత్వలోపం ఢిల్లీకి శాపమైంది.
తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (24; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), రోవ్‌మన్ పావెల్ (34 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 3 వికెట్లు తీశాడు. తర్వాత ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ కిషన్ (35 బం తుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) , టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించారు.
కష్టంగానే మొదలైనా...
ముంబై లక్ష్యఛేదన కష్టంగానే మొదలైంది. రోహిత్ (2) నిరాశపరిస్తే... ఇషాన్, బ్రెవిస్ (33 బంతుల్లో 37; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టును నడిపించారు. కుల్దీప్ 12వ ఓవర్ మూడో బంతికి కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఐదో బంతికి బ్రెవిస్ వికెట్ దక్కేది కానీ సునాయాసమైన క్యాచ్‌ను పంత్ నేలపాలు చేశాడు. లేదంటే మ్యాచ్‌ను ఈ ఓవర్ మలుపు తిప్పేది. 15వ ఓవర్లో బ్రెవిస్‌ను శార్దుల్ బౌల్డ్ చేశాడు. మరుసటి బంతికి ‘డేంజర్’ బ్యాటర్ డేవిడ్ అవుటవ్వాలి. అతని బ్యాట్ అంచును తాకుతూ వెళ్లిన బంతిని పంత్ అందుకున్నప్పటికీ అప్పీల్‌ను అంపైర్ తోసి పుచ్చాడు. పంత్ రివ్యూ కోరలేదు. దీంతో డేవిడ్ సిక్సర్లతో ముంబైని గెలుపు తీరానికి తెచ్చాడు. ఆఖర్లో అతనితోపాటు తిలక్ (21; 1 ఫోర్, 1 సిక్స్) అవుటైనా... రమణ్‌దీప్ (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment