ముంబై విజయానందం
ముంబై: గుజరాత్ 178 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లే 12 ఓవర్లలో 106 పరుగులు చేశారు. ఇక మిగిలిన 8 ఓవర్లలో 72 పరుగులు 10 వికెట్లున్న జట్టుకు కష్టమే కాదు. కానీ ముంబై బౌలర్ల కష్టం, చక్కని ఫీల్డింగ్, ఆఖరి బంతి దాకా చూపిన పోరాటం టైటాన్స్‌కు ఊహించని షాకిచ్చాయి. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో ఆఖరి ఓవర్ వేసిన సామ్స్ వికెట్ తీయడమే కాకుండా కేవలం 3 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 5 పరుగులతో గెలిచింది.
మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు.
రాణించిన రోహిత్, కిషన్
రోహిత్ రెండో ఓవర్లో 2 ఫోర్లు, భారీ సిక్సర్‌తో వేగం పెంచాడు. రషీద్ ఖాన్ తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు. పవర్ ప్లేలో ముంబై 63/0 స్కోరు చేసింది. రోహిత్‌ను రషీద్ ఎల్బీగా పంపగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (13), ఇషాన్ కిషన్, పొలార్డ్ (4) వికెట్లను కోల్పోయింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. షమీ వేసిన 16వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన డేవిడ్, జోసెఫ్ 18వ ఓవర్లో బౌలర్ తలపైనుంచి సిక్సర్ బాదాడు.
ఓపెనర్లే వంద వరకు...
ఓపెనర్లు సాహా, గిల్ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తుండటంతో ముంబై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ప్రధాన సీమర్ బుమ్రా బౌలింగ్‌ను సాహా చితగ్గొట్టాడు. గిల్ కూడా పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 54 పరుగులు చేసింది. సామ్స్ వేసిన 8వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టిన గిల్, కార్తికేయ ఓవర్లో 6, 4 బాదాడు. సాహా (34 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ (33 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒకరి వెంట ఒకరు ఫిఫ్టీలు పూర్తి చేసుకొన్నారు. జట్టు స్కోరు వంద దాటాకా మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో గిల్, సాహాలను పెవిలియన్ పంపాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రషీద్ (బి) జోసెఫ్ 45; రోహిత్ (ఎల్బీ) (బి) రషీద్‌ఖాన్ 43; సూర్యకుమార్ (సి) రషీద్ (బి) సంగ్వాన్ 13; తిలక్ రనౌట్ 21; పొలార్డ్ (బి) రషీద్ 4; డేవిడ్ నాటౌట్ 44; సామ్స్ (సి) రషీద్ (బి) ఫెర్గూసన్ 0; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–74, 2–99, 3–111, 4–119, 5–157, 6–164.
బౌలింగ్: షమీ 4–0–42–0, జోసెఫ్ 4–0–41–1, రషీద్ 4–0–24–2, ఫెర్గూసన్ 4–0–34–1, సంగ్వాన్ 3–0–23–1, తెవాటియా 1–0–11–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) సామ్స్ (బి) మురుగన్ 55; గిల్ (సి) పొలార్డ్ (బి) మురుగన్ 52; హార్దిక్ రనౌట్ 24; సుదర్శన్ హిట్‌వికెట్ (బి) పొలార్డ్ 14; మిల్లర్ నాటౌట్ 19; తెవాటియా రనౌట్ 3; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–106, 2–111, 3–138, 4–156, 5–171
బౌలింగ్: సామ్స్ 3–0–18–0, బుమ్రా 4–0–48–0, మురుగన్ అశ్విన్ 4–0–29–2, మెరిడిత్ 4–0–32–0, కార్తికేయ 3–0–29–0, పొలార్డ్ 2–0–13–1.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ X రాజస్తాన్
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
లక్నో X కోల్‌కతా
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment