ముంబై: అంబటి రాయుడు అద్భుత బ్యాటింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. చెన్నైను విజయానికి దాదాపు చేరువగా తెచ్చిన ఈ బ్యాటర్ చివర్లో వెనుదిరగడంతో జట్టుకు మరో ఓటమి తప్పలేదు. సోమవారం జరిగిన పోరులో పంజాబ్ 11 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (59 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. అంబటి రాయుడు (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. చెన్నై విజయానికి చివరి 4 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి ఉండగా...ఇందులో 2 ఓవర్లు వేసిన అర్‡్షదీప్ 14 పరుగులే ఇవ్వడం పంజాబ్‌ను గెలిపించింది. జడేజా (21 నాటౌట్) ప్రభావం చూపలేకపోగా, ధోని (12) ‘మ్యాజిక్’ ఈసారి పని చేయలేదు.
రాణించిన రాజపక్స...
పంజాబ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది. పవర్‌ప్లే ముగిసేసరికి 37 పరుగులు మాత్రమే చేసిన జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (18) వికెట్ కూడా కోల్పోయింది. ఈ దశలో శిఖర్, రాజపక్స జోడి జట్టును నడిపించింది. వ్యక్తిగత స్కోరు ‘1’ వద్ద రాజపక్స ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్ వదిలేయడం కూడా పంజాబ్‌కు కలిసొచ్చింది. అయితే ఆశించిన దూకుడు కనిపించకపోవడంతో 10 ఓవర్లలో స్కోరు 78 పరుగులు మాత్రమే. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ధాటి పెరిగింది. ముకేశ్ ఓవర్లో శిఖర్ మూడు ఫోర్లు కొట్టగా, ప్రిటోరియస్ ఓవర్లో పంజాబ్ 14 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో 37 బంతుల్లో శిఖర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న అతనికిది 46వ హాఫ్ సెంచరీ. రెండో వికెట్‌కు శిఖర్‌తో 110 పరుగులు (71 బంతుల్లో) జోడించిన తర్వాత 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాజపక్స వెనుదిరిగాడు. అనంతరం ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్లో పంజాబ్ పండగ చేసుకుంది. ఈ ఓవర్లో లివింగ్‌స్టోన్ (12 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వరుస బంతుల్లో 4, 6, 6 బాదగా, శిఖర్ మరో ఫోర్ కొట్టడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో మరో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 13 పరుగులు రాబట్టింది.
రాయుడు మినహా...
రెండో ఓవర్లో ఉతప్ప (1) వికెట్ కోల్పోయిన చెన్నైకి ఛేదనలో సరైన ఆరంభం లభించలేదు. సాన్‌ట్నర్ (9), దూబే (8) కూడా విఫలమయ్యారు. అనంతరం రుతురాజ్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే రాయుడు బ్యాటింగే చెన్నైకి విజయావకాశాలు కల్పించింది. ఫీల్డింగ్ చేస్తుండగా తొలి ఓవర్లోనే మణికట్టు గాయంతో మైదానం వీడిన రాయుడు బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఆ నొప్పి కనిపించకుండా భారీ షాట్లతో చెలరేగాడు.
రాయుడు క్రీజ్‌లోకి వచ్చేసరికి చెన్నై 78 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉండగా... అతను అవుటయ్యే సమయానికి సమీకరణం 13 బంతుల్లో 35 పరుగులకు చేరిందంటే అది అతని చలవే! రిషి ఓవర్లో 4, 6తో జోరు మొదలు పెట్టిన అతను లివింగ్‌స్టోన్ ఓవర్లో ఇదే తరహాలో 4, 6 బాదాడు. 28 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తి కాగా, సందీప్ ఓవర్లో రాయుడు వరుసగా 6, 6, 6, 4తో చెలరేగిపోయాడు. అయితే అప్పటికే బాగా అలసిపోయిన అతడిని రబడ బౌల్డ్ చేయడంతో చెన్నై గెలుపు ఆశలు సన్నగిల్లాయి. 27 పరుగులు చేయాల్సిన చివరి ఓవర్లో ధోనిని రిషి అవుట్ చేయడంతో చెన్నై ఓటమి ఖాయమైంది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) దూబే (బి) తీక్షణ 18; శిఖర్ ధావన్ (నాటౌట్) 88; రాజపక్స (సి) దూబే (బి) బ్రేవో 42; లివింగ్‌స్టోన్ (సి) ముకేశ్ (బి) బ్రేవో 19; బెయిర్‌స్టో (రనౌట్) 6; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–37, 2–147, 3–174, 4–187. బౌలింగ్: ముకేశ్ 4–0–36–0, తీక్షణ 4–0–32–1, సాన్‌ట్నర్ 2–0–8–0, జడేజా 2–0–18–0, ప్రిటోరియస్ 4–0–50–0, బ్రేవో 4–0–42–2.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మయాంక్ (బి) రబడ 30; ఉతప్ప (సి) రిషి (బి) సందీప్ 1; సాన్‌ట్నర్ (బి) అర్‡్షదీప్ 9; దూబే (బి) రిషి 8; రాయుడు (బి) రబడ 78; జడేజా (నాటౌట్) 21; ధోని (సి) బెయిర్‌స్టో (బి) రిషి 12; ప్రిటోరియస్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–10, 2–30, 3–40, 4–89, 5–153, 6–168.
బౌలింగ్: రబడ 4–0–23–2, సందీప్ 4–0–40–1, రిషి ధావన్ 4–0–39–2, అర్‡్షదీప్ 4–0–23–1, రాహుల్ చహర్ 3–0–30–0, లివింగ్‌స్టోన్ 1–0–12–0.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X రాజస్తాన్ రాయల్స్
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment