ముంబై: ఐపీఎల్–2022లో రెండు వరస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి విజయం దక్కింది. తమలాగే గెలుపు రుచి చూడని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి రైజర్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ సూపర్ కింగ్స్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
మొయిన్ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్ 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ త్రిపాఠి (15 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
రాణించిన అలీ...
ఓపెనర్ల వైఫల్యంతో చెన్నైకి టోర్నీలో మరోసారి చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఉతప్ప (15)ను అవుట్ చేసి సుందర్ తొలి దెబ్బ కొట్టగా, నటరాజన్ తన మొదటి బంతికే రుతురాజ్ (16)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ దశలో అలీ, అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు 50 బంతుల్లో 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో 2 పరుగుల వ్యవధిలోనే చెన్నై అలీ, దూబే (3) వికెట్లు కోల్పోయింది. ధోని (3) కూడా విఫలం కాగా, చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో చెన్నై కనీస స్కోరైనా చేయగలిగింది.
అలవోకగా...
గత మూడు సీజన్లలో హైదరాబాద్ తరఫున ఆడినా... 19 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని అభిషేక్ శర్మ ఈసారి ఓపెనర్‌గా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. తొలి రెండు మ్యాచ్‌లలో 9, 13 పరుగులే చేసిను అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో జట్టును విజయం దిశగా నడిపించాడు. తీక్షణ ఓవర్లో అభిషేక్ ఫోర్, సిక్స్ కొట్టగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 37 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అభిషేక్ అర్ధసెంచరీ పూర్తి కాగా, మరో ఎండ్ నుంచి విలియమ్సన్ కూడా చక్కటి షాట్లతో సహకరించాడు.
ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చెన్నై ఎట్టకేలకు 13వ ఓవర్ తొలి బంతికి రైజర్స్ కెప్టెన్‌ను వెనక్కి పంపించగలిగింది. విజయం కోసం 47 బంతుల్లో 66 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన త్రిపాఠి దూకుడైన బ్యాటింగ్‌తో దూసుకుపోయాడు. జోర్డాన్ ఓవర్లో అతను ఒక సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అభిషేక్, త్రిపాఠి రెండో వికెట్‌కు 31 బంతుల్లోనే 56 పరుగులు జత చేశారు. విజయానికి అతి చేరువగా వచ్చాక అభిషేక్ అవుటైనా... త్రిపాఠి మ్యాచ్ ముగించాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) మార్క్‌రమ్ (బి) సుందర్ 15; రుతురాజ్ (బి) నటరాజన్ 16; మొయిన్ అలీ (సి) త్రిపాఠి (బి) మార్క్‌రమ్ 48; రాయుడు (సి) మార్క్‌రమ్ (బి) సుందర్ 27; దూబే (సి) ఉమ్రాన్ (బి) నటరాజన్ 3; జడేజా (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 23; ధోని (సి) ఉమ్రాన్ (బి) జాన్సెన్ 3; బ్రేవో (నాటౌట్) 8; జోర్డాన్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–25, 2–36, 3–98, 4–108, 5–110, 6–122, 7–147.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, మార్కో జాన్సెన్ 4–0–30–1, వాషింగ్టన్ సుందర్ 4–0–21–2, నటరాజన్ 4–0–30–2, ఉమ్రాన్ మలిక్ 3–0–29–0, మార్క్‌రమ్ 1–0–8–1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) జోర్డాన్ (బి) బ్రేవో 75; విలియమ్సన్ (సి) అలీ (బి) ముకేశ్ 32; రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 39; నికోలస్ పూరన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 2 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–89, 2–145.
బౌలింగ్: ముకేశ్ 4–0–30–1, మహీశ్ తీక్షణ 4–0–31–0, జోర్డాన్ 3–0–34–0, జడేజా 3–0–21–0, మొయిన్ అలీ 1–0–10–0, బ్రేవో 2.4–0–29–1.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా నైట్‌రైడర్స్ X ఢిల్లీ క్యాపిటల్స్
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
రాజస్తాన్ X లక్నో సూపర్ జెయింట్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
.@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v
— IndianPremierLeague (@IPL) April 9, 2022
Comments
Please login to add a commentAdd a comment