IPL 2023: 'There Is No Recipe For Success' Says MS Dhoni After CSK In Playoffs - Sakshi
Sakshi News home page

#MS Dhoni: ఆ ఒక్క మాట.. మరోసారి అభిమానుల మనసు గెలిచాడు! విజయ రహస్యం ఏంటి?

Published Sun, May 21 2023 10:42 AM | Last Updated on Sun, May 21 2023 11:07 AM

IPL 2023 CSK In Playoffs: Dhoni Says There Is No Recipe For Success - Sakshi

IPL 2023- CSK- MS Dhoni: అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం.. సరైన సమయంలో వాళ్లకు ఆడే అవకాశమివ్వడమే విజయ రహస్యమని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని తెలిపాడు. మేనేజ్‌మెంట్‌ జట్టుకు అన్ని విధాలా అండగా ఉందని.. సీఎస్‌కే సక్సెస్‌ క్రెడిట్‌ వాళ్లకు కూడా దక్కుతుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది చెన్నై.

ఇప్పటి వరకు ధోని సారథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే.. ఐపీఎల్‌-2023లోనూ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 77 పరుగుల భారీ తేడాతో గెలుపొంది బెర్తు ఖరారు చేసుకుంది. కాగా సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించడం ఇది 12వసారి.

విజయ రహస్యం ఏంటి?
ఈ క్రమంలో అత్యధికసార్లు ఈ ఫీట్‌ నమోదు చేసిన జట్టుగా ధోని సేన చరిత్ర సృష్టించింది. దీంతో ధోని కెప్టెన్సీపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో విజయానంతరం ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

‘‘ప్రత్యేకంగా విజయసూత్రాలు అంటూ ఏమీ ఉండవు. మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకోవడం.. వారి సేవలను వినియోగించుకునే తీరుపైనే అంతా ఆధారపడి ఉంటుంది.

వాళ్లే అత్యంత ముఖ్యం
యాజమాన్యం కూడా అన్ని విధాలా ఆటగాళ్లకు అండగా నిలిచింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వాలి. అయితే, అదే సమయంలో ప్లేయర్లు కూడా ముఖ్యమే. ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వకపోతే కెప్టెన్‌, మేనేజ్‌మెంట్‌ ఎవరూ ఏం చేయలేరు కదా!’’ అంటూ ధోని అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

యువ బౌలర్లలో ఆత్మవిశ్వాసం
ఇక యువ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. తుషార్‌లో ఆ కాన్ఫిడెన్స్‌ ఉంది. రానురాను తన బౌలింగ్‌ మెరుగుపడుతోంది. అందుకే అతడికి వరుస అవకాశాలు ఇచ్చాం.

పతిరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒత్తిడిని జయించి డెత్‌ ఓవర్లలో రాణించడం అతడిలో ఉన్న సానుకూలాంశం. ఏ ఆటగాడికైనా గడ్డు పరిస్థితులు సహజం. అలాంటి సమయంలో వాళ్లు 10% ఇచ్చినా.. మేము 50% అడ్జస్ట్‌ చేసుకుని వాళ్లు జట్టులో నిలదొక్కుకునేలా చేస్తాం’’అని ధోని చెప్పుకొచ్చాడు.

కాగా ఈ మ్యాచ్‌లో తుషార్‌ దేశ్‌పాండే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. పతిరణ 22 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో డేవిడ్‌ వార్నర్‌(86)ను అవుట్‌ చేయడం కేవలం 3 పరుగులే ఇవ్వడం ముచ్చటగొలిపింది.

చదవండి:  Virat Kohli: ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్‌కు తెలిసొచ్చింది! చెత్తగా.. 
#RinkuSingh: ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement