IPL 2023: Gujarat Titans vs Kolkata Knight Riders Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. కేకేఆర్‌ సంచలన విజయం

Published Sun, Apr 9 2023 3:24 PM | Last Updated on Sun, Apr 9 2023 7:26 PM

IPL 2023 GT Vs KKR Ahmedabad: Playing XI Highlights And Updates - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ సంచలన విజయం సాధించింది. కేకేఆర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరమయ్యాయి. యష్‌ దయాల్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు.

ఇక్కడి నుంచే రింకూ సింగ్‌ విధ్వంసం మొదలైంది. చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.  ఈ క్రమంలో రింకూ సింగ్‌ 21 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అంతకముందు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ 40 బంతుల్లో 80 పరుగులు చేసి కేకేఆర్‌ విజయానికి బాటలు వేశాడు. అయితే ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసి మ్యాచ్‌ను గుజరాత్‌ వైపు టర్న్‌ చేశాడు. అయితే యశ్‌ దయాల్‌ ఆఖరి ఓవర్లో చెత్తగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ ఓటమికి కారణమయ్యాడు. 

5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌, రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌
నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్‌ 5 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకునేలా ఉంది. రషీద్‌ ఖాన్‌ వరుస బంతుల్లో రసెల్‌, నరైన్‌, శార్దూల్‌ వికెట్లు పడగొట్టి, ఈ సీజన్‌ తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. 

వెంకటేశ్‌ అయ్యర్‌ ఔట్‌
40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం (83) సృష్టించిన వెంకటేశ్‌ అయ్యర్‌..  అ‍ల్జరీ జోసఫ్‌ బౌలింగ్‌లో గిల్‌కు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 155/4.

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. కెప్టెన్‌ ఔట్‌
ధాటిగా ఆడుతున్న కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా 45 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. అల్జరీ జోసఫ్‌ బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 132/3. 

ధాటిగా ఆడుతున్న అయ్యర్‌, రాణా
205 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే 2 వికెట్లు కోల్నోయిన కేకేఆర్‌... వికెట్లు పడ్డా ఏమాత్రం తగ్గకుండా ధాటిగా బ్యాటింగ్‌ చేస్తుంది. వెంకటేశ్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ నితీశ్‌రాణా (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 116/2గా ఉంది.  

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
28 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జాషువ లిటిల్‌ బౌలింగ్‌లో అభినవ్‌ మనోహర్‌కు క్యాచ్‌ ఇచ్చి జగదీశన్‌ (6) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 28/2. 

యశ్‌ దయాల్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌..  కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
యశ్‌ దయాల్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ పట్టడంతో కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో దయాల్‌ షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో గుర్భాజ్‌ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 26/1గా ఉంది. జగదీశన్‌(5), వెంకటేశ్‌ అయ్యర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

విధ్వంసం సృష్టించిన త్రీడీ ప్లేయర్‌.. గుజరాత్‌ భారీ స్కోర్‌
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. విజయ్‌ శంకర్‌ (24 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (38 బంతుల్లో 53; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించగా, శుభ్‌మన్‌ గిల్‌ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌కు 3, సుయాశ్‌ శర్మకు ఓ వికెట్‌ దక్కింది. 

నరైన్‌కు మరో వికెట్‌.. సాయి సుదర్శన్‌ ఔట్‌
158 పరుగుల వద్ద గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌ సాయి సుదర్శన్‌ (53) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో నరైన్‌కు ఇది మూడో వికెట్‌. 

సుయాశ్‌ సూపర్‌ డెలివరీ.. అభినవ్‌ మనోహర్‌ క్లీన్‌ బౌల్డ్‌
కేకేఆర్‌ యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ సూపర్‌ డెలివరీతో అభినవ్‌ మనోహర్‌ను (14) బోల్తా కొట్టించి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 132/3. సాయి సుదర్శన్‌ (46), విజయ్‌ శంకర్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.  

శుభ్‌మన్‌ ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్
100 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద శుభ్‌మన్‌ గిల్‌ సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఉమేశ్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 12 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 101/2. సాయి సుదర్శన్‌ (31), అభినవ్‌ మనోహర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

నిలకడగా ఆడుతున్న గిల్‌, సుదర్శన్‌
సాహా వికెట్‌ పడ్డాక కూడా గిల్‌ (27), సుదర్శన్‌ నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 68/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్‌ ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని దాటాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌.. జగదీశన్‌ సూపర్‌ క్యాచ్‌
5వ ఓవర్‌ రెండో బంతికి గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో జగదీశన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో సాహా 17 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 38/1. గిల్‌ (10), సాయి సుదర్శన్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.  

అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 9) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాల్టి మ్యాచ్‌కు గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా దూరం కాగా అతని స్థానంలో రషీద్‌ ఖాన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్ధిక్‌ స్థానంలో విజయ్‌ శంకర్‌ జట్టులోకి వచ్చాడు. కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. టిమ్‌ సౌథీ స్థానంలో ఫెర్గూసన్‌, మన్‌దీప్‌ సింగ్‌ ప్లేస్‌లో జగదీశన్‌ తుది జట్టులోకి వచ్చారు. 

తుది జట్లు..
గుజరాత్‌ టైటాన్స్‌: వృద్దిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, విజయ్‌ శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, అభినవ్‌ మనోహర్‌, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ షమీ, అల్జరీ జోసఫ్‌, యశ్‌ దయాల్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రహ్మానుల్లా గుర్భాజ్‌ (వికెట్‌కీపర్‌), ఎన్‌ జగదీశన్‌, నితీశ్‌ రాణా (కెప్టెన్‌), రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, సుయాశ్‌ శర్మ, లోకీ ఫెర్గూసన్‌, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement