IPL 2023 KKR Vs GT: 5 Sixes Rinku Singh Old Chat With Yash Dayal Goes Viral - Sakshi
Sakshi News home page

#Rinku Singh: అవును.. బిగ్‌ ప్లేయర్‌.. 5 సిక్స్‌లు.. కానీ పాపం నువ్వే బలైపోయావు!

Published Mon, Apr 10 2023 12:08 PM | Last Updated on Mon, Apr 10 2023 1:15 PM

IPL 2023 KKR Vs GT: 5 Sixes Rinku Singh Old Chat With Yash Dayal Goes Viral - Sakshi

కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణాతో రింకూ సింగ్‌ (PC: iplt20.com)

IPL 2023-  Rinku Singh-  Yash Dayal: ఆఖరి ఓవర్‌.. నువ్వా- నేనా అన్నట్లు హోరాహొరీ.. నరాలు తెగే ఉత్కంఠ.. యశ్‌ దయాల్‌ రంగంలోకి దిగాడు. అప్పటికి రింకూ సింగ్‌ 16 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌ మొదలుపెట్టగానే.. క్రీజులో ఉన్న ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి రింకూకు స్ట్రైక్‌ ఇచ్చాడు.

ఇక తర్వాత సంగతి చెప్పేదేముంది.. రింకూ దెబ్బకు యశ్‌ దయాల్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దయాల్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. చివరి ఓవర్లో అద్భుతాలు చేసే డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు పీడకల మిగులుస్తూ.. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చి.. చిరస్మరణీయ గెలుపు అందించాడు. ఈ దెబ్బతో రింకూ సింగ్‌ పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగి పోతుండగా.. చెత్త బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన యశ్‌ దయాల్‌ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాడు.

బిగ్‌ ప్లేయర్‌ అంటూ
ఈ క్రమంలో వీరి మధ్య ఇటీవల జరిగిన జరిగిన చాట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఆదివారం నాటి గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ కంటే ముందు ఏప్రిల్‌ 6న కేకేఆర్‌ సొంతగడ్డపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ ఆడింది.

ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ 33 బంతులు ఎదుర్కొని 46 పరుగులు చేశాడు. ఇక శార్దూల్‌ ఠాకూర్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి, సూయశ్‌ శర్మ విజృంభించిన నేపథ్యంలో ఆర్సీబీపై కేకేఆర్‌ 81 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.

ఈ గెలుపై హర్షం వ్యక్తం చేస్తూ రింకూ సింగ్‌.. ‘‘చిరస్మరణీయ విజయం.. మమ్మల్ని ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఫొటోలు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా.. యశ్‌ దయాల్‌.. ‘‘బిగ్‌ ప్లేయర్‌ భాయ్‌’’ అంటూ రింకూకు శుభాకాంక్షలు తెలిపాడు.

పాపం నువ్వే బలైపోయావు
కట్‌చేస్తే.. తాజా మ్యాచ్‌లో యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లోనే ఆదివారం రింకూ సింగ్‌ చితక్కొట్టాడు. దీంతో యశ్‌ దయాల్‌ పాత కామెంట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అవును.. పవర్‌ హిట్టర్‌.. నువ్వన్నట్లు బిగ్‌ ప్లేయర్‌.. కానీ అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నువ్వే బలైపోయావు పాపం’’ అని కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు.

మరికొందరేమో.. ‘‘పర్వాలేదు. క్రీడాస్ఫూర్తి ఉండాలి. నీకింకా చాలా భవిష్యత్తు ఉంది యశ్‌ దయాల్‌. ఒక్క మ్యాచ్‌తో ఏం కాదు. లోపాలు సవరించుకుని ముందుకు సాగిపో’’ అని అండగా నిలుస్తున్నారు.

కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో రింకూ సింగ్‌ 21 బంతుల్లో ఒక ఫోర్‌, ఆరు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేసిన ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే యశ్‌ దయాల్‌ ఈ మ్యాచ్లో4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 69 పరుగులు సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. కాగా యూపీకి చెందిన రింకూ, యశ్‌ దేశవాళీ క్రికెట్‌లో తమ జట్టుకు కలిసే ఆడుతున్నారు.

చదవండి: SRH Vs PBKS: అద్భుత ఇన్నింగ్స్‌.. త్రిపాఠి- మార్కరమ్‌ అరుదైన ఘనత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement