IPL 2023 Qualifier 1, CSK VS GT: MS Dhoni Argues With Umpire, Leading To 4 Minute Delay. Here’s Why - Sakshi
Sakshi News home page

IPL 2023 QF 1: అంపైర్లతో ధోని వాగ్వాదం.. మ్యాచ్‌ 4 నిమిషాలు ఆలస్యం

Published Wed, May 24 2023 7:27 AM | Last Updated on Wed, May 24 2023 9:01 AM

IPL 2023 QF1 CSK VS GT: Dhoni Argues With Umpire, Leading To 4 Minute Delay - Sakshi

PC: IPL Twitter

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌, నిజాయితీకి మారు పేరుగా చెప్పుకునే మహేంద్ర సింగ్‌ ధోని.. నిన్న (మే 23) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్స్‌ 1 మ్యాచ్‌ సందర్భంగా ఒకింత అసహనానికిలోనై, పరోక్షంగా తొండాట ఆడాడు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి కూడా దిగాడు. ఫలితంగా మ్యాచ్‌ 4 నిమిషాలు ఆలస్యమైంది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేసేందుకు మతీష పతిరణ సిద్దంగా ఉన్న సమయంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

ఆ సమయంలో గుజరాత్‌ ఛేదనలో చాలా వెనుకబడి ఉంది. 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. పతిరణకు తన కోటాలో ఇంకా 3 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే, పతిరణ 16వ వేసే ముందు మైదానంలో నిర్దిష్ట సమయం గడపకుండా, నేరుగా డగౌట్‌ నుంచి వచ్చి బౌలింగ్‌ వేసేందుకు సిద్దపడ్డాడు. నిబంధనల ప్రకారం బౌలింగ్‌ వేయడానికి ముందు బౌలర్‌ కచ్చితంగా 9 నిమిషాల పాటు మైదానంలో గడపాలి.

అలా కాకుండా పతిరణ డగౌట్‌ నుంచి నేరుగా వచ్చి బౌలింగ్‌ వేసేందుకు సిద్దపడటంతో అంపైర్లు అతన్ని అనుమతించలేదు. ఆ సమయంలో పతిరణ బౌలింగ్‌ ప్రాధాన్యత తెలిసిన ధోని.. అంపైర్లతో వాదించి మరీ అతనితో బౌలింగ్‌ చేయించాడు. ధోని నుంచి ఈ తరహా బిహేవియర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయని జనం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ధోని మ్యాచ్‌ అయితే గెలిచాడు కాని.. అభిమానుల మనసుల్లో వంచకుడిగా మిగిలిపోతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జట్టు గెలిపించుకోవడంలో భాగంగా ఇవన్నీ మామూలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ధోని ఇలాంటి సాహసోపేతమైన, వ్యూహాత్మకమైన చర్యలకు పాల్పడి సీఎస్‌కేను రికార్డు స్థాయిలో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేర్చాడు. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.  

చదవండి: ప్లాన్‌ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement