PC: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా గుజరాత్ వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టి, టైటిల్ పోరులో సీఎస్‌కేతో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సెర్మనీలో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. జట్టు సభ్యులపై, ప్రత్యేకించి శతక వీరుడు గిల్, తన తురుపు ముక్క రషీద్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ విజయాల వెనుక ఆటగాళ్ల కఠోర శ్రమ దాగి ఉందని కొనియాడాడు. జట్టులోని సభ్యులందరూ అనునిత్యం సాధన చేస్తూనే ఉంటారని, దాని ఫలితమే తాము సాధిస్తున్న విజయాలని అన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉంటారని, కలిసికట్టుగా ఆడటమే తమ విజయ రహస్యమని తెలిపాడు.
శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. అతని ఆత్మవిశ్వాసం, ఆటపై అతనికున్న స్పష్టత అత్యద్భుతమని ప్రశంసించాడు. నేటి ఇన్నింగ్స్ నేను చూసిన వాటిలో అత్యుత్తమమని కొనియాడాడు. గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లో ఎక్కడా హడావుడి కనిపించలేదని అన్నాడు. ఎవరో బంతులు విసురుతుంటే, కొట్టినట్లు అనిపించిందని తెలిపాడు. గిల్ ఫ్రాంచైజీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతాడని జోస్యం చెప్పాడు.
రషీద్ ఖాన్‌పై స్పందిస్తూ.. అతని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతని గురించి చాలా అనుకున్నాం. అతను మా జట్టుకు తరుపు ముక్క. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆధారపడగలిగే వ్యక్తి అతను. ఎన్నో సందర్భాల్లో ఇది నిరూపితమైంది.
ముంబైపై గెలిచి ఫైనల్‌కు చేరుకోవడంపై స్పందిస్తూ.. ముంబై లాంటి కఠినమైన జట్టుపై గెలిచి ఫైనల్‌కు చేరుకోవడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఫైనల్లో తాము ఇంకా కఠినమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాల్సి ఉంది. వంద శాతం ఎఫర్ట్ పెడితే కానీ సీఎస్‌కేను ఓడించలేము. మంచి క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నాము. నాకౌట్ మ్యాచ్‌లు ఏ విధంగా అయినా టర్న్ అవ్వచ్చు. ఏదిఏమైనా ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.
చదవండి: శుభ్‌మన్ గిల్‌కు ఆరెంజ్ క్యాప్.. అయితే గుజరాత్ టైటిల్ గెలవడం కష్టం..!
Comments
Please login to add a commentAdd a comment