Photo Credit: IPL Twitter
ఐపీఎల్-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (18.5 కోట్లు).. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తూ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కర్రన్ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్ గ్రీన్ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్ రాహుల్ (లక్నో, 17 కోట్లు), బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్ ఓకే అనిపిస్తున్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్‌లో 16 పరుగులకు డిఫెండ్ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్ ఎడిషన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కర్రన్ ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు డిఫెండ్ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి ఓవర్ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ టైటిల్ కల సాకారమవుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే, పంజాబ్-రాజస్థాన్ జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన టఫ్ ఫైట్‌లో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్‌ను హెట్‌మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్‌తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment