IPL 2023: My Heartbeat Was Definitely Touching 200; Varun Chakravarthy On Bowling Final Over Against SRH - Sakshi
Sakshi News home page

#Varun Chakravarthy: నరాలు తెగే ఉత్కంఠ! అప్పుడు నా హార్ట్‌బీట్‌ 200కు చేరువైంది.. అయితే..

Published Fri, May 5 2023 12:11 PM | Last Updated on Fri, May 5 2023 1:36 PM

IPL 2023 SRH Vs KKR Varun Chakravarthy: My Heartbeat Was Touching 200 - Sakshi

IPL 2023 SRH Vs KKR: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి అద్బుత ఆట తీరు కనబరిచాడు. కీలక సమయంలో ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టుకు విజయం అందించాడు. ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను గెలుపు తీరాలకు చేర్చి.. రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు.

ఐపీఎల్‌-2023లో రైజర్స్‌తో మొదటి ముఖాముఖి పోరులో సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది.

ఆరంభంలోనే ఎదురుదెబ్బలు
ఈ క్రమంలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. సొంతమైదానంలో రైజర్స్‌ రెచ్చిపోతుందనుకుంటే.. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

ఓపెనర్లు అభిషేక్‌ శర్మ(9)ను శార్దూల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌ (18)ను హర్షిత్‌ రాణా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి (9 బంతుల్లో 20 పరుగులు) ఆట ఆండ్రీ రసెల్‌ బౌలింగ్‌లో వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇవ్వడంతో ముగిసింది.

క్లాసెన్‌ ఆకట్టుకున్నా
ఈ క్రమంలో రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ (41 బంతుల్లో 40 పరుగులు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (20 బంతుల్లో 36 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. మార్కరమ్‌ను వైభవ్‌, క్లాసెన్‌ను శార్దూల్‌ అవుట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్లో రైజర్స్‌ విజయ సమీకరణం 9 పరుగులుగా మారింది.

బంతి బంతికీ ఉత్కంఠ
క్రీజులో అబ్దుల్‌ సమద్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నారు. అప్పుడు కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా బంతిని వరుణ్‌ చక్రవర్తికి అందించాడు. చివరి ఓవర్‌.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. చక్రవర్తి బౌలింగ్‌లో మొదటి బంతికి అబ్దుల్‌ సమద్‌ ఒక పరుగు తీశాడు.

రెండో బంతికి లెగ్‌బై రూపంలో పరుగు వచ్చింది. ఇక మూడో బంతికి వరుణ్‌ మ్యాజిక్‌ చేసి సమద్‌ను అవుట్‌ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మయాంక్‌ మార్కండే.. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. 

ఐదో బంతికి ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి భువీ చేతులెత్తేయడంతో కేకేఆర్‌ విజయం ఖరారైంది. కీలక ఓవర్లో 3 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించిన వరుణ్‌ చక్రవర్తిని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వరుణ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హార్ట్‌బీట్‌ 200కు చేరింది.. అతడు 2 ఫోర్లు బాదాడు!
‘‘ఆఖరి ఓవర్లో నా హార్ట్‌బీట్‌ 200కు చేరువైంది. అయితే.. ఏదేమైనా వాళ్లను కట్టడి చేయాలని ఫిక్సైపోయాను. ఓ వైపు బాలేమో స్లిప్‌ అవుతోంది. ఎలాగైనా బ్యాటర్లను ట్రాప్‌ చేసి లాంగ్‌ షాట్లు ఆడేలా చేయాలని భావించా. నా మొదటి ఓవర్లో 12 పరుగులు ఇచ్చాను.

మార్కరమ్‌ నా బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదాడు. నిజానికి.. గతేడాది నేను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేశాను. లోపాలు సరిచేసుకున్నాను. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నా’’ అని వరుణ్‌ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో వరుణ్‌ 301 పరుగులు ఇచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్‌ తీశాడు.

చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్‌
ఎక్కడివాళ్లు అక్కడ ఉండాలి.. మధ్యలో దూరడం ఎందుకు: గౌతీపై ఇంగ్లండ్‌ దిగ్గజం విమర్శలు 
చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్‌! స్కూల్‌ మొత్తం తెలుసు! ఓరోజు.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement