ఐపీఎల్-2023లో భాగంగా జైపూర్‌లోని సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 19) ఓ రసవత్తర సమరం జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్ జట్ల మధ్య నేడు టఫ్ ఫైట్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు)తో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఢీకొట్టనుంది.
అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో గెలుపెవరిదన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా లక్నోతో పోలిస్తే రాజస్థాన్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. సొంత మైదానంలో ఆడటం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో రాజస్థానే విజయం సాధించింది. ఇది కూడా ఆ జట్టుకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది.
జట్టు బలాబలాల విషయానికొస్తే.. రాజస్థాన్ టీమ్‌లో దాదాపు ప్రతి ఆటగాడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అసలు ఆ జట్టులో ఎవరిని తుది జట్టులో ఆడించాలన్నది మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిలా మారింది. దేశీ, విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా అందరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటారు. జేసన్ హోల్డర్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుందంటే ఆ జట్టు ఎంత బలంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది.
బ్యాటింగ్‌లో బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, షిమ్రోన్ హెట్‌మైర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చహల్ ఇరగదీస్తున్నారు. తుది జట్టులో అవకాశాలు దక్కించుకుంటూ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఉన్నారా అంటే.. అది ఒక్క రియాన్ పరాగేనని చెప్పాలి. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ ఇతనికి ప్రత్యామ్నాయాన్ని వెతకవచ్చు. పరాగ్ ప్లేస్‌లో పడిక్కల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే జంపా స్థానంలో జేసన్ హోల్డర్ తుది జట్టులోకి రావచ్చు.
లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. రాజస్థాన్‌తో పోలిస్తే కాస్త వెనుకపడ్డట్టేనని చెప్పాలి. పంజాబ్‌తో ఆడిన గత మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ లైనప్‌లో లోపాలు బయటపడ్డాయి. ఒకరిద్దరి మెరుపులు, బౌలర్ల ప్రదర్శనతో ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో గెలిచింది కానీ బ్యాటింగ్‌లో మూకుమ్మడిగా ఎప్పుడూ రాణించింది లేదు. ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే దీపక్ హుడా దారుణంగా విఫలమవుతున్నాడు.
కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ వన్ మ్యాచ్ వండర్స్‌లా మిగిలిపోయారు. కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. అతను పరుగులు సాధిస్తున్నప్పటికీ అందులో వేగం లోపించింది. ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో మార్క్ వుడ్ అత్తుత్తమ ఫామ్‌లో ఉండటం లక్నోకు ఇప్పటివరకు కలిసొచ్చింది. అతనికి జతగా ఆవేశ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, బిష్ణోయ్ పర్వాలేదనిపిస్తున్నారు.
గత మ్యాచ్‌లో యుద్ద్‌వీర్ సింగ్ చరక్ సత్తా చాటడం లక్నోకు అదనంగా కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలతో పాటు సొంతగడ్డపై ఆడుతుండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశమేనని చెప్పాలి. ఆ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడుకునే విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఇది కూడా పలు సందర్భాల్లో ఆ జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment