ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌? బుమ్రా అసహనం.. పోస్ట్‌ వైరల్‌ | IPL 2024 Bumrah Cryptic Post Viral Amid Rumours Of Hardik To Be MI Captain | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై కెప్టెన్‌గా పాండ్యా? బుమ్రా అసహనం.. పోస్ట్‌ వైరల్‌

Published Tue, Nov 28 2023 12:53 PM | Last Updated on Tue, Nov 28 2023 1:43 PM

IPL 2024 Bumrah Cryptic Post Viral Amid Rumours Of Hardik To Be MI Captain - Sakshi

హార్దిక్‌ పాండ్యా- బుమ్రా (PC: IPL/BCCI)

IPL 2024- Mumbai Indians: ఐపీఎల్‌ చరిత్రలో సంచలన ట్రేడింగ్‌గా నిలిచింది హార్దిక్‌ పాండ్యా వ్యవహారం. ఈ ఆల్‌రౌండర్‌కు జీవితాన్నిచ్చిన ముంబై ఇండియన్స్‌.. గాయాల బెడదతో బాధపడుతున్న సమయంలో అతడిని వదిలేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ లేనప్పటికీ కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ హార్దిక్‌ పాండ్యాపై నమ్మకం ఉంచింది. గతంలో కెప్టెన్సీ అనుభవం లేకున్నా పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది.

అరంగేట్రంలోనే చాంపియన్‌గా
యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్లుగానే ఈ బరోడా క్రికెటర్‌.. అరంగేట్ర సీజన్‌లోనే టైటాన్స్‌ను 2022 సీజన్‌ విజేతగా నిలిపాడు. అదే విధంగా.. ఐపీఎల్‌-2023 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టును ఫైనల్‌ వరకు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 వేలానికి ముందు పాండ్యా జట్టు మారనున్నాడనే వార్తలు వినిపించినా టైటాన్స్‌ అభిమానులు మాత్రం వీటిని వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు.

అనూహ్యంగా సొంతగూటికి పాండ్యా
అందుకు తగ్గట్లుగానే గుజరాత్‌ టైటాన్స్‌ తమ రిటైన్‌ ప్లేయర్ల జాబితాలో పాండ్యా పేరును చేర్చింది. కానీ గంటల వ్యవధిలోనే అతడు సొంత గూటికి చేరిపోయాడు. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ అధికారికంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. పాండ్యా కోసం రూ. 15 కోట్లు టైటాన్స్‌కు చెల్లించి అతడిని తిరిగి తీసుకుంది. 

తీవ్ర అసహనంలో బుమ్రా?
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ అభిమానులు ఖుషీ అవుతుండగా.. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌, టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దమే అత్యుతమ సమాధానంగా నిలుస్తుంది’’ అంటూ బుమ్రా చేసిన పోస్ట్‌ ఇందుకు కారణం.

కాగా టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ టీ20లకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో.. హార్దిక్‌ పాండ్యా ముంబై కెప్టెన్సీ చేపట్టడం లాంఛనమే కానుంది. అయితే, ఇదే బుమ్రా అసహనానికి కారణంగా తెలుస్తోంది.

రోహిత్‌ తర్వాత నాయకుడు కావాలనుకున్న బుమ్రా?
రోహిత్‌ తర్వాత ముంబై నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే బుమ్రా ఇన్నాళ్లూ ఆ జట్టుతో కొనసాగుతున్నాడని.. అయితే, పాండ్యా రీఎంట్రీతో అది సాధ్యపడదన్న విషయం అతడికి అర్థమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టా వేదికగా ఇలాంటి పోస్ట్‌ పెట్టాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుమ్రా పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఆర్సీబీని ఫాలో అవుతున్నాడంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. ముంబైని వీడి అతడు బెంగళూరు ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అత్యాశతో ఉన్నవాళ్లకే పెద్దపీట
మరోవైపు.. అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జట్టుకట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా బుమ్రా అధికారికంగా ఈ విషయంపై స్పందిస్తేనే స్పష్టత వస్తుంది. అయితే, బుమ్రా అభిమానులు మాత్రం.. ‘‘నమ్మకంగా ఉండేవాళ్ల కంటే.. అత్యాశతో అటూ ఇటూ పరుగులు తీసేవాళ్లకే ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు’’ అంటూ పాండ్యా జట్టు మారిన తీరును విమర్శిస్తున్నారు.  

చదవండి: IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ వదిలేసింది.. కసితో సుడిగాలి శతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement