ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 8) జరుగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ న్యూస్ అందింది. వేర్వేరు కారణాల చేత ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండిన ఆ జట్టు స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారని తెలుస్తుంది. టీ20 వరల్డ్‌కప్ వీసా ప్రాసెస్ కోసం స్వదేశానికి (బంగ్లాదేశ్) వెళ్లిన ముస్తాఫిజుర్ చెన్నైకి బయల్దేరాడని సమాచారం.
గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పతిరణ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తుంది. ముస్తాఫిజుర్, పతిరణ కేకేఆర్‌తో జరుగబోయే నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సీఎస్‌కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరు అందుబాటులోకి రాకపోయినా సీఎస్‌కే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. కేకేఆర్‌తో మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
కాగా ముస్తాఫిజుర్, పతిరణ లేని లోటు సీఎస్‌కేకు గత మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ ఇద్దరి గైర్హాజరీలో ఆ జట్టు బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోయింది. ముస్తాఫిజుర్, పతిరణ స్థానాల్లో వచ్చిన విదేశీ ప్లేయర్లు రాణించినప్పటికీ (మొయిన్, తీక్షణ).. లోకల్ పేసర్లు ముకేశ్ చౌదరీ, తుషార్ దేశ్‌పాండే దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే వీరిద్దరిని నమ్ముకుని బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చు. ప్రస్తుత ఎడిషన్‌లో ముస్తాఫిజుర్ 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు.. పతిరణ 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే సీఎస్‌కే విజయావకాశాలు మెరుగవుతాయి.
ఇదిలా ఉంటే, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ రెండో స్థానంలో.. సీఎస్‌కే నాలుగో స్థానంలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధిస్తే.. సీఎస్‌కే నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, రెండు అపజయాలు ఎదుర్కొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని మట్టికరిపించగా.. సీఎస్‌కే సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment