ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 8) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్‌కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Ravindra Jadeja - The Game Changer of CSK with ball. 🔥pic.twitter.com/HsyMhbDsTJ
— Johns. (@CricCrazyJohns) April 8, 2024
బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్‌లో ధోని సైతం సీఎస్‌కే తరఫున 15 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్ రైనా (12), రుతురాజ్ గైక్వాడ్ (10), మైక్ హస్సీ (10) ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్‌కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment