
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 24) జరుగబోయే మ్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్‌కు ఐపీఎల్‌లో 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 64 మంది 100 మ్యాచ్‌లు ఆడగా.. గిల్ 65వ ఆటగాడు కానున్నాడు.
2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్.. 2021 వరకు కేకేఆర్ తరఫున, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్‌ల కెరీర్‌లో 135.2 స్ట్రయిక్‌రేట్‌తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టులో (గుజరాత్) భాగమైన గిల్.. 2023 సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన నాకౌట్‌లో గిల్ మెరుపు సెంచరీతో మెరిశాడు.
కాగా, నేటి మ్యాచ్‌లో గుజరాత్ ఢిల్లీని వారి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్‌లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. గుజరాత్‌కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్‌లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోనే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment