ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి.
కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్‌తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్‌తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు.
కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో నరైన్‌తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌గా ఉంది.
273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్‌ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు.
వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment