
గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి అర్దంతరంగా వైదొలిగిన మిచెల్ మార్ష్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్, కండల వీరుడు గుల్బదిన్ నైబ్‌ను ఎంపిక చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నైబ్‌ను డీసీ మేనేజ్‌మెంట్ 50 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. త్వరలో నైబ్ జట్టుతో చేరతాడని డీసీ ఓ ప్రకటనలో తెలిపింది. నైబ్‌కు ఇది తొలి ఐపీఎల్.
ఆఫ్ఘనిస్తాన్ తరఫున 82 వన్డేలు, 62 టీ20లు ఆడిన నైబ్.. రెండు ఫార్మాట్లలో కలిపి 99 వికెట్లు పడగొట్టి, 2038 పరుగులు చేశాడు. నైబ్ ఖాతాలో ఓ ఐదు వికెట్ల ఘనత, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 33 ఏళ్ల నైబ్ 2019లో ఆఫ్ఘన్ వన్డే జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో నైబ్ విశేషంగా రాణించాడు. ఈ సిరీస్‌లో బంతితో పర్వాలేదనిపించిన నైబ్.. బ్యాటింగ్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.
మార్ష్ విషయానికొస్తే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో మార్ష్ తొలి నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆతర్వాత అతను గాయపడటంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ సీజన్‌లో మార్ష్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. డీసీ యాజమాన్యం మార్ష్‌ను ఈ ఏడాది వేలంలో 6.5 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.
ఢిల్లీ విషయానికొస్తే.. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు..ఇప్పుడిప్పుడే విజయాల బాట పట్టింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఇందులో తప్పక గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఢిల్లీ ఏప్రిల్ 27న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 26) కేకేఆర్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment