గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్టార్‌ వచ్చేస్తున్నాడు! | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్టార్‌ వచ్చేస్తున్నాడు!

Published Mon, Mar 11 2024 10:13 AM

IPL 2024 Good News For GT Rashid Khan Set to Return From Injury In T20Is - Sakshi

IPL 2024- Gujarat Titans: అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని రషీద్‌ ఖాన్‌ ధ్రువీకరించాడు.

కాగా అఫ్గన్‌ లెగ్‌ స్పిన్నర్‌ భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ, లీగ్‌ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్‌- ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్‌ ఖాన్‌ వెల్లడించాడు.

‘‘రానున్న సిరీస్‌లో జాతీయ జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టాను. అన్నీ సజావుగా సాగుతున్నాయి. నిజానికి సర్జరీ కారణంగా గడిచిన మూడు నెలల కాలం కష్టంగా తోచింది. ఏడెనిమిది నెలలుగా వెన్నునొప్పి బాధపెడుతోంది. 

వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారు. అయితే, ఐసీసీ మెగా ఈవెంట్‌లో దేశం తరఫున ఆడాలనే నేను నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడంతా బాగుంది. రానున్న రోజులు మరింత గొప్పగా ఉంటాయని భావిస్తున్నాను’’ అని రషీద్‌ ఖాన్‌ అఫ్గన్‌ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అదే విధంగా.. టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు ఐపీఎల్‌ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్‌ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశాడు.  ఐపీఎల్‌కాగా రషీద్‌ ఖాన్‌ రీఎంట్రీ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు కూడా శుభవార్తగా పరిణమించింది. 

ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టును వీడి ముంబై ఇండియన్స్‌ సారథి కాగా.. మహ్మద్‌ షమీ తాజా సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ ఆగమనం టైటాన్స్‌కు ఊరట కలిగించనుంది. ఇక గత సీజన్‌లో రషీద్‌ ఖాన్‌ 17 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు తీశాడు.

తద్వారా అత్యధిక వికెట్‌ టేకర్ల మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. మార్చి 15- 18 వరకు అఫ్గన్‌- ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇక ఐపీఎల్‌-2024లో గుజరాత్‌ మార్చి 24న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్‌ సిక్స్‌ హిట్టర్‌ అతడే: ద్రవిడ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement