అలా అయితే తొలి బంతికే అవుటయ్యే వాడిని! | IPL 2024 I Was Asking Sanju Bhaiya To Let Me Hit One: Riyan Parag | Sakshi
Sakshi News home page

IPL 2024: అలా అయితే తొలి బంతికే అవుటయ్యే వాడిని: ‘ఓవరాక్షన్‌’ స్టార్‌

Published Mon, Mar 25 2024 3:28 PM | Last Updated on Mon, Mar 25 2024 4:23 PM

IPL 2024 I Was Asking Sanju Bhaiya To Let Me Hit One: Riyan Parag - Sakshi

సంజూ శాంసన్‌తో రియాన్‌ పరాగ్‌ (PC: IPL X)

గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 78 పరుగులు.. ఆట కంటే కూడా అతి చేష్టలతోనే వార్తల్లో ఉంటాడంటూ ఘాటు విమర్శలు.. ఇక సోషల్‌ మీడియాలో అయితే ‘ఓవరాక్షన్‌’ స్టార్‌ అనే ట్యాగ్‌తో జరిగే ట్రోలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

మీరు ఊహించిన పేరు నిజమే.. రియాన్‌ పరాగ్‌. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్నాడీ అసోం ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన రియాన్‌.. రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌. 

నిజానికి రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో రియాన్‌కు వచ్చినన్ని అవకాశాలు మరెవరికీ రాలేదు. అయినా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక విమర్శలు మూటగట్టుకున్నాడతడు. అయితే, ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన రియాన్‌.. ఐపీఎల్‌-2024లోనూ శుభారంభం అందుకున్నాడు.

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రియన్‌ పరాగ్‌.. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(82 నాటౌట్‌)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే ఒక ఫోర్‌, మూడు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేశాడు. 

సంజూతో కలిసి 59 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. తద్వారా లక్నోపై రాజస్తాన్‌ విజయంలో తానూ భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ.. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ వల్లే తన ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిందని కృతజ్ఞతలు తెలిపాడు.

‘‘ప్రాక్టీస్‌ చేసే సమయంలో కొత్తగా నేర్చుకున్న కొన్ని షాట్లను ఇక్కడ ట్రై చేస్తానని సంజూ భయ్యాతో చెప్పాను. తనతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నపుడు ‘ప్లీజ్‌ భయ్యా.. ఒక్కటంటే ఒక్క షాట్‌ కొడతా’ అని బతిమిలాడాను. 

కానీ భయ్యా మాత్రం.. ‘వద్దు.. వద్దు.. ఈ రోజు వికెట్‌ అంత అనుకూలంగా లేదు’ అని నన్ను వారించాడు. ఒకవేళ భయ్యా అలా చెప్పి ఉండకపోతే హడావుడిలో వికెట్‌ పారేసుకునేవాడినేమో. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకున్న షాట్లను సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

భయ్యా జాగ్రత్తలు చెప్పకపోయి ఉంటే తొలి బంతికే అవుటయ్యే వాడిని’’ అని రియాన్‌ పరాగ్‌ చెప్పుకొచ్చాడు. కాగా జైపూర్‌లో లక్నోతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందిన రాజస్తాన్‌ ఐపీఎల్‌-2024ను విజయంతో ఆరంభించింది.

చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement