IPL 2024: కోల్‌కతాకే కిరీటం | IPL 2024: Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 8 wickets to win 3rd IPL title | Sakshi
Sakshi News home page

IPL 2024: కోల్‌కతాకే కిరీటం

Published Mon, May 27 2024 5:44 AM | Last Updated on Mon, May 27 2024 6:00 AM

IPL 2024: Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 8 wickets to win 3rd IPL title

ఐపీఎల్‌ చాంపియన్‌ నైట్‌రైడర్స్‌ 

మూడోసారి విజేతగా నిలిచిన జట్టు 

ఫైనల్లో సన్‌రైజర్స్‌కు తీవ్ర నిరాశ 

8 వికెట్ల తేడాతో పరాజయం

సన్‌రైజర్స్‌ అభిమానులకు తీవ్ర వేదన... లీగ్‌ దశలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌కు కొత్త పాఠాలు నేర్పిన టీమ్‌ అదే బ్యాటింగ్‌ వైఫల్యంతో చివరి మెట్టుపై చతికిలపడింది. 8 బంతుల వ్యవధిలో అభిషేక్‌ శర్మ, హెడ్‌ లాంటి హిట్టర్లు వెనుదిరగ్గా... క్లాసెన్‌కు కూడా కాలం కలిసిరాని వేళ జట్టంతా కుప్పకూలింది. ఏ మూలకూ సరిపోని 114 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 63 బంతుల్లోనే ఛేదించేసి సంబరాలు చేసుకుంది.

 దశాబ్ద కాలం తర్వాత మూడో టైటిల్‌ అందుకొని సగర్వంగా నిలిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ట్రోఫీ గెలవాలని ఆశించిన హైదరాబాద్‌ 2018 తరహాలో ఫైనల్‌కే పరిమితమై నిరాశలో మునిగింది.  ఆసాంతం బ్యాటర్లు చెలరేగిన 2024 టోర్నీ చివరకు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముగిసింది.  విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ. 20 కోట్లు... రన్నరప్‌ హైదరాబాద్‌ జట్టుకు రూ. 12 కోట్ల 50 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  

చెన్నై: పదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) మళ్లీ ఐపీఎల్‌ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం చెపాక్‌ మైదానంలో ఏకపక్షంగా సాగిన ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఫైనల్‌ పోరులో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌)దే అత్యధిక స్కోరు. అనంతరం నైట్‌రైడర్స్‌ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (26 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రహ్మానుల్లా గుర్బాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 45 బంతుల్లో 91
పరుగులు జోడించి జట్టును గెలిపించారు.  

సమష్టి వైఫల్యం... 
తొలి ఓవర్లో స్టార్క్‌ వేసిన అద్భుత బంతికి అభిõÙక్‌ శర్మ (2) క్లీన్‌బౌల్డ్‌ కావడంతో మొదలైన సన్‌రైజర్స్‌ పతనం వేగంగా సాగింది. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు ఏ దశలోనూ హైదరాబాద్‌ తిరిగి కోలుకోలేకపోయింది. హెడ్‌ (0) తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఆడిన తొలి బంతికి అవుటై మరో డకౌట్‌ ఖాతాలో వేసుకున్నాడు. త్రిపాఠి (13 బంతుల్లో 9; 1 ఫోర్‌) ఈసారి ఆదుకోలేకపోగా, నితీశ్‌ రెడ్డి (10 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్‌), షహబాజ్‌ (7 బంతుల్లో 8; 1 సిక్స్‌), అబ్దుల్‌ సమద్‌ (4) విఫలమయ్యారు. 

మరోవైపు మార్క్‌రమ్‌ (23 బంతుల్లో 20; 3 ఫోర్లు) పరుగులు తీయడానికి ఇబ్బంది పడగా... క్లాసెన్‌ (17 బంతుల్లో 16; 1 ఫోర్‌) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోరు 90/7. క్లాసెన్‌ క్రీజ్‌లో ఉండటంతో చివరి 6 ఓవర్లలోనైనా ఎక్కువ పరుగులు సాధించవచ్చని రైజర్స్‌ ఆశించింది. అయితే తర్వాతి బంతికే అతను బౌల్డ్‌ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో కమిన్స్‌ కొన్ని పరుగులు జత చేసి స్కోరును 100 దాటించాడు.  

ఫటాఫట్‌... 
స్వల్ప ఛేదనలో కేకేఆర్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. నరైన్‌ (2 బంతుల్లో 6; 1 సిక్స్‌) ఆరంభంలోనే వెనుదిరిగినా... వెంకటేశ్, గుర్బాజ్‌ వేగంగా జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. భువనేశ్వర్‌ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన వెంకటేశ్, ఆ తర్వాత నటరాజన్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 4 బాది లక్ష్యాన్ని మరింత సులువగా మార్చేశాడు. 24 బంతుల్లోనే వెంకటేశ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. విజయానికి 12 పరుగుల దూరంలో గుర్బాజ్‌ అవుటైనా... వెంకటేశ్, కెపె్టన్‌ శ్రేయస్‌ (3 బంతుల్లో 6 నాటౌట్‌; 1 ఫోర్‌) కలిసి ఆట ముగించారు.  

స్కోరు వివరాలు  
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (బి) స్టార్క్‌ 2; హెడ్‌ (సి) గుర్బాజ్‌ (బి) వైభవ్‌ అరోరా 0; త్రిపాఠి (సి) రమణ్‌దీప్‌ (బి) స్టార్క్‌ 9; మార్క్‌రమ్‌ (సి) స్టార్క్‌ (బి) రసెల్‌ 20; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) గుర్బాజ్‌ (బి) హర్షిత్‌ రాణా 13; క్లాసెన్‌ (బి) హర్షిత్‌ రాణా 16; షహబాజ్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 8; సమద్‌ (సి) గుర్బాజ్‌ (బి) రసెల్‌ 4; కమిన్స్‌ (సి) స్టార్క్‌ (బి) రసెల్‌ 24; జైదేవ్‌ ఉనాద్కట్‌ (ఎల్బీ) (బి) నరైన్‌ 4; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్‌) 113. 
వికెట్ల పతనం: 1–2, 2–6, 3–21, 4–47, 5–62, 6–71, 7–77, 8–90, 9–113, 10– 113. 
బౌలింగ్‌: స్టార్క్‌ 3–0–14–2, వైభవ్‌ అరోరా 3–0–24–1, హర్షిత్‌ రాణా 4–1–24– 2, నరైన్‌ 4–0–16–1, రసెల్‌ 2.3–0– 19–3, వరుణ్‌ చక్రవర్తి 2–0–9–1.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (ఎల్బీ) (బి) షహబాజ్‌ 39; నరైన్‌ (సి) షహబాజ్‌ (బి) కమిన్స్‌ 6; వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 52; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (10.3 ఓవర్లలో 2 వికెట్లకు) 114. 
వికెట్ల పతనం: 1–11, 2–102. 

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0– 25–0, కమిన్స్‌ 2–0–18–1, నటరాజన్‌ 2–0– 29–0, షహబాజ్‌ 2.3–0–22–1, ఉనాద్కట్‌ 1–0–9–0, మార్క్‌రమ్‌ 1–0–5–0.  

ఐపీఎల్‌–17 బౌండరీ మీటర్‌ 
మొత్తం సిక్స్‌లు: 1260 
మొత్తం ఫోర్లు: 2174 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement