
ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 14) రాత్రి బిగ్ ఫైట్ జరుగనుంది. చెరి ఐదు సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరిని భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.
ధోని మరో 4 పరుగులు చేస్తే సీఎస్‌కే తరఫున 5000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున కేవలం సురేశ్ రైనా (5529) మాత్రమే ఈ ఘనత సాధించాడు. సీఎస్‌కే తరఫున ధోని 249 మ్యాచ్‌ల్లో 4996 పరుగులు చేశాడు. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్ సీఎస్‌కే తరఫున ధోనికి 250వ మ్యాచ్ కావడం మరో విశేషం.
సీఎస్‌కేతో మ్యాచ్‌లో రోహిత్ మరో 11 పరుగులు చేస్తే.. ముంబై, సీఎస్‌కే ఎల్ క్లాసికో మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేశ్ రైనా పేరిట ఉంది. రైనా 30 మ్యాచ్‌ల్లో 710 పరుగులు చేశాడు. 27 మ్యాచ్‌ల్లో 700 పరుగులు చేసిన రోహిత్.. మరో 11 పరుగులు చేస్తే రైనా రికార్డును బద్దలు కొడతాడు. ఈ రికార్డు విభాగంలో ధోని మూడో స్థానంలో ఉన్నాడు. సీఎస్‌కే, ముంబై మ్యాచ్‌ల్లో (35) ధోని 655 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment