విధ్వంసకర వీరుడు.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో ఆల్‌రౌండర్‌గా! | IPL 2024 RCB vs KKR: Andre Russell Creates History Rare Feet In IPL | Sakshi
Sakshi News home page

IPL 2024: విధ్వంసకర వీరులు.. చరిత్ర సృష్టించిన రసెల్‌, నరైన్‌

Published Sat, Mar 30 2024 12:42 PM | Last Updated on Sat, Mar 30 2024 3:07 PM

IPL 2024 RCB vs KKR: Andre Russell Creates History Rare Feet In IPL - Sakshi

ఆండ్రీ రసెల్‌ (PC: IPL/KKR)

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆండ్రీ రసెల్‌ చరిత్ర సృష్టించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ రెండు వికెట్లు తీశాడు.

నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్‌ గ్రీన్‌(33), రజత్‌ పాటిదార్‌(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్‌ హిట్టర్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాకుండా చేశారు కేకేఆర్‌ బ్యాటర్లు.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై కోల్‌కతా విజయానికి కారణమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఆండ్రీ రసెల్‌ ఐపీఎల్‌లో సరికొత్త ఫీట్‌ నమోదు చేశాడు.

లీగ్‌ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు కనీసం వంద వికెట్లు తీసిన రెండో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌, టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. 

జడ్డూ ఇప్పటి వరకు 228 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కలిపి 2724 పరుగులు సాధించడంతో పాటు.. 152 వికెట్లు తీశాడు. ఇక రైటార్మ్‌ పేస్‌ బౌలర్‌ అయిన రసెల్‌ 114 మ్యాచ్‌లలో 2326 రన్స్‌ పూర్తి చేసుకుని 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌) తరఫున రసెల్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు.

ఆ తర్వాత రెండేళ్లకు కేకేఆర్‌ శిబిరంలో చేరిన అతడు పదేళ్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రసెల్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో రసెల్‌ రెండు వికెట్లు తీశాడు కూడా! 

నరైన్‌ @ 500 
వెస్టిండీస్‌ ఆఫ్‌స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ టి20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌తో అతను ఈ ఫార్మాట్‌లో అతను 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. నరైన్‌కు ముందు పొలార్డ్‌ (660), డ్వేన్‌ బ్రేవో (573), షోయబ్‌ మలిక్‌ (542) అతనికంటే ముందు 500 మ్యాచ్‌లు ఆడారు.

35 ఏళ్ల నరైన్‌ ఈ సుదీర్ఘ కెరీర్‌లో ఏకంగా 17 టి20 జట్లకు ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌ కప్‌ సహా మొత్తం 10 టైటిల్స్‌ విజయాల్లో అతను భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 2012నుంచి వరుసగా 13 సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున 164 మ్యాచ్‌లు ఆడాడు.  బ్యాటింగ్‌లో కూడా ఓపెనర్‌గా, పించ్‌ హిట్టర్‌గా బరిలోకి దిగి కేకేఆర్‌ పలు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు.

చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్‌ కామెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement