ఆర్సీబీ యాజమాన్యంపై భారత టెన్నిస్ దిగ్గజం.. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ స్పెషలిస్ట్ (12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విన్నర్) మహేశ్ భూపతి తీవ్రస్థాయి ధ్వజమెత్తాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన నేపథ్యంలో భూపతి అసహనం వ్యక్తం చేశాడు. నిన్న (ఏప్రిల్ 15) ఆర్సీబీపై సన్‌రైజర్స్ రికార్డు స్కోర్ చేసిన అనంతరం భూపతి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇలా అన్నాడు.
క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ అభిమానులు, ఆటగాళ్ళ కోసం బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీసీఐ చొరవ తీసుకుని ఆర్సీబీని స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి అప్పగించండి. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం అంటూ భూపతి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic
— Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024
స్వతహాగా ఆర్సీబీ అభిమాని అయిన భూపతి తన ఆరాధ్య ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీ పేలవ ప్రదర్శన చూసి విరక్తి చెంది ఈ ట్వీట్ చేశాడని తెలుస్తుంది. భూపతి విరాట్, డుప్లెసిస్‌లను బాగా అభిమానిస్తాడు. విరాట్‌పై అభిమానాన్ని భూపతి గతంలో చాలా సందర్భాల్లో బహిర్గతం చేశాడు. ఆర్సీబీ తాజా దుస్థితికి యాజమాన్య వైఖరి కారణమని భావిస్తున్న భూపతి కొత్త యాజమాన్యానికి ఫ్రాంచైజీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐని కోరాడు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ఛేదనలో విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment