టీ20కా 'డాన్‌' రషీద్‌ ఖాన్‌.. రోహిత్‌, రుతురాజ్‌, గిల్‌ కంటే ఎక్కువగా..! | Sakshi
Sakshi News home page

IPL 2024 RR VS GT: టీ20కా 'డాన్‌' రషీద్‌ ఖాన్‌.. రోహిత్‌, రుతురాజ్‌, గిల్‌ కంటే ఎక్కువగా..!

Published Thu, Apr 11 2024 1:29 PM

IPL 2024 RR VS GT: Rashid Khan Won Most Player Of The Match Awards At The Age Of 25 - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ పొట్టి క్రికెట్‌ను శాసిస్తున్నాడని అనడం కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్‌లో టోర్నీలు ఎ‍క్కడ జరిగినా వాలిపోయే రషీద్‌..  ప్రతి మ్యాచ్‌లో తనదైన మార్కు వేస్తుంటాడు. ఐపీఎల్‌లో అయితే రషీద్‌ ఆటతీరు వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ రషీద్‌ సత్తా చాటుతుంటాడు. బంతితో కాకపోతే బ్యాట్‌తో అయినా చెలరేగుతుంటాడు. ప్రతి మ్యాచ్‌లో తన జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటాడు.

రషీద్‌ ఆటతీరుకు అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు సైతం ముగ్దులవుతుంటారు. ఇండియాలో రషీద్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అభిమానులు టీమిండియా స్టార్లతో సమానంగా రషీద్‌ను అభిమానిస్తారు. క్రికెట్‌ అభిమానులు రషీద్‌ను ముద్దుగా టీ20కా 'డాన్‌' అని పిలుచుకుంటారు. 

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రషీద్‌ తాను టీ20 డాన్‌ను అని మరోసారి రుజువు చేసుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీసిన రషీద్‌.. తన జట్టు కష్ట సమయంలో (చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సిన దశలో) ఉన్నప్పుడు బ్యాట్‌ పట్టి మెరుపు ఇన్నింగ్స్‌ (11 బంతుల్లో 24 నాటౌట్‌; 4 ఫోర్లు) ఆడాడు.

ఫలితంగా తన జట్టు గుజరాత్‌.. రాజస్థాన్‌కు వారి సొంతగడ్డపై ఊహించని షాకిచ్చింది. బంతితో పాటు బ్యాట్‌తో చెలరేగి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించినందుకు గాను రషీద్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది. ఐపీఎల్‌లో రషీద్‌కు ఇది 12వ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. 25 ఏళ్ల వయసులో ఇన్ని ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు ఐపీఎల్‌ చరిత్రలో ఎవరూ గెలవలేదు. టీమిండియా స్టార్లు శుభ్‌మన్‌ గిల్‌ 9, రుతురాజ్‌ 8, రోహిత్‌ శర్మ 7 అవార్డులు మాత్రమే గెలిచారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.  రషీద్‌ ఖాన్‌ చివరి బంతికి బౌండరీ బాది గుజరాత్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. సంజూ శాంసన్‌ (68 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (76) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ (72), రషీద్‌, తెవాతియా (22) రాణించడంతో గుజరాత్‌ చివరి బంతికి విజయతీరాలకు చేరింది. 

Advertisement
Advertisement