చరిత్ర సృష్టించిన నితీశ్‌ రెడ్డి.. ఐపీఎల్‌లోనే తొలి ఆటగాడిగా | IPL 2024 SRH Nitish Kumar Reddy Achieves Rare IPL Milestone Scripts History | Sakshi
Sakshi News home page

#NitishReddy: చరిత్ర సృష్టించిన నితీశ్‌ రెడ్డి.. ఐపీఎల్‌లోనే తొలి ఆటగాడిగా

Published Wed, Apr 10 2024 11:21 AM | Last Updated on Wed, Apr 10 2024 12:52 PM

IPL 2024 SRH Nitish Kumar Reddy Achieves Rare IPL Milestone Scripts History - Sakshi

యువ సంచలనం నితీశ్‌ రెడ్డి (PC: SRH X)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఘనత సాధించాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచి అరుదైన రికార్డు నమోదు చేశాడు.

కాగా ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు సాగిన హోరాహోరీ పోరులో కేవలం రెండు పరుగుల తేడాతో రైజర్స్‌ జయకేతనం ఎగురవేసింది.

టాపార్డర్‌ విఫలమైనా
సొంత మైదానంలో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పంజాబ్‌కు శుభారంభమే లభించింది. ట్రవిస్‌ హెడ్‌(21), డేంజరస్‌ బ్యాటర్లు అభిషేక్‌ శర్మ(16), ఐడెన్‌ మార్క్రమ్‌(0)లను త్వరగానే పెవిలియన్‌కు పంపి.. సన్‌రైజర్స్‌ టాపార్డర్‌ను దెబ్బకొట్టింది.

ఈ క్రమంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి(11) ఏమాత్రం ప్రభావం చూపకపోగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి పట్టుదలగా నిలబడ్డాడు. విధ్వంసకర వీరుడు హెన్రిచ్‌ క్లాసెన్‌(9) కూడా తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. అబ్దుల్‌ సమద్‌తో కలిసి నితీశ్ దూకుడు పెంచాడు.

ప్రత్యర్థి బౌలర్లపై నితీశ్‌, సమద్‌ ఎదురుదాడి
ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో వీరిద్దరూ కలిసి కేవలం 19 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. నితీశ్‌ (37 బంతుల్లో 64), సమద్‌ (12 బంతుల్లో 25) ఇన్నింగ్స్‌ కారణంగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చిన సన్‌రైజర్స్‌ పేసర్లు.. ఆ తర్వాత బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఆఖరి వరకు మ్యాచ్‌ సాగగా.. ఫైనల్‌గా రెండు పరుగులతో గెలిచి సన్‌రైజర్స్‌ ఊపిరి పీల్చుకుంది.

ఐపీఎల్‌లో అరుదైన ఘనత
రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌కుమార్‌ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్‌ కమిన్స్‌, నటరాజన్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌తో పాటు నితీశ్‌ కుమార్‌ కూడా ఒక వికెట్‌(జితేశ్‌ శర్మ) దక్కించుకున్నాడు. అంతేకాదు.. పంజాబ్ బ్యాటర్‌ ప్రభ్‌షిమ్రన్‌ సింగ్‌ ఇచ్చిన క్యాచ్‌ను కూడా అందుకున్నాడు.

ఈ క్రమంలో నితీశ్‌ రెడ్డి అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఇలా ఒక ఇన్నింగ్స్‌లో యాభైకి పైగా పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్‌, ఒక క్యాచ్‌ అందుకున్న తొలి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా నితీశ్‌ రెడ్డి రికార్డులకెక్కాడు. 

తెలుగు కుర్రాడు
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 2003లో జన్మించిన నితీశ్‌ రెడ్డి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం అయిన ఈ ఆంధ్ర ఆటగాడు.. రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ కూడా!

ఇక ఇదే మ్యాచ్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి మరో ఫీట్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అర్ధ శతకం సాధించిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. 20 ఏళ్ల 319 రోజుల వయసులో నితీశ్‌ ఐపీఎల్‌ ఫిఫ్టీ సాధించగా.. ప్రియం గార్గ్‌ 19 ఏళ్ల 307 రోజుల వయసులో ఈ ఘనత సాధించి అతడి కంటే ముందు వరుసలో ఉన్నాడు.

చదవండి: T20 WC: హార్దిక్‌, రాహుల్‌కు నో ఛాన్స్‌.. ఆ ముగ్గురూ ఫిక్స్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement